మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. మొన్నటి వరకు రాజ్యసభ్యుడిగా ఉన్న చిరంజీవి ప్రస్తుతం సినిమాలతోనే బిజీ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో పేరుకు ఉన్నప్పటికి ఆయన ఏ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎంపీ పదవి కాలం పూర్తి అయిన తర్వాత చిరంజీవి ఏ ఇతర రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. ఇలాంటి సమయంలో చిరంజీవికి టీడీపీ గాలం వేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. బహిరంగంగా మద్దతు ఇవ్వకపోయినా కూడా, చిరంజీవి పరోక్షంగా మద్దతు ఇచ్చిన చాలు అంటూ టీడీపీ నాయకులు అంటున్నారు.చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నాడు. టీడీపీ నాయకులకు ఆయన చుక్కలు చూపిస్తున్నాడు. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవన్ ముందుకు సాగుతున్నాడు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ్యతిరేకం అయ్యాడు. పవన్ లేని లోటును చిరంజీవితో తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం మెల్ల మెల్లగా ప్రయత్నాలు కూడా సాగిస్తున్నాడు.
రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి ఉన్న సమయంలో ఏపీలో పలు అభివృద్ది కార్యక్రమాలకు తన ఎంపీ లాడ్స్ నిధులను చిరంజీవి కేటాయించడం జరిగింది. ఆ నిధులతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఆ విషయాన్ని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా చిరంజీవిని కలిసి వివరించడం జరిగింది. చిరంజీవి ఎంపీగా ఉన్న సమయంలో ఇచ్చిన నిధులు మరియు వాటితో చేపట్టిన కార్యక్రమాల గురించి క్లారిటీగా చెప్పడంతో చిరంజీవి సంతోషంను వ్యక్తం చేశాడు.తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఏపీకి ఏం చేయలేదు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. వారికి ఇవి చూపించే అవకాశం తెలుగు దేశం పార్టీ కల్పించిందని చిరంజీవి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇదే సమయంలో కొల్లు రవీంద్ర 2019 ఎన్నికల్లో మీ సాయం మాకు కావాలండి, మీ మద్దతుతో మేం ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.