ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్స్ కి బాబు పిలుపు…ఆ రోజున మీటింగ్ !

CBN

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 22న రాష్ట్ర రాజధాని అమరావతిలో మొన్న జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసిన అందరు అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈరోజు టీడీపీ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు చంద్రబాబుకు ఎన్నికల సంఘంపై ఫిర్యాదులు చేశారు. దీనిపై టీడీపీ అధినేత స్పందిస్తూ, ఈసీపై తమ పోరాటం ఆ అవకతవకలపైనే అని స్పష్టం చేశారు. అనంతరం, అమరావతిలో జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలంటూ ప్రత్యేకంగా కోరారు. ఇక, చంద్రబాబునాయుడు ఈనెల 23 నుంచి మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మిత్రపార్టీల తరఫున ఎన్నికల సభలకు హాజరయ్యారు. ఈసారి ఉత్తరాది రాష్ట్రాల్లో చంద్రబాబు పర్యటన సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్ లో, ఆయన పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలోనూ చంద్రబాబు ప్రచారం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.