Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అధికారులు తమతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆరోపించడం, వారి తీరుకు నిరసనగా రాజీనామా చేస్తామని హెచ్చరించడం సాధారణంగా ఎప్పుడూ జరిగేదే. కానీ అధికారపక్ష ఎమ్మెల్యే సీఎం కార్యాలయ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తితో రాజీనామాకు సిద్ధపడడం కలకలంగా మారింది. కృష్టాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖను తీసుకుని ఏపీ అసెంబ్లీకి రాగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పార్టీకి విధేయుడిగా గుర్తింపు పొందిన వంశీ రాజీనామా ఎందుకు చేయాలనుకుంటున్నారో ఎవరికీ మొదట అర్ధం కాలేదు. ముఖ్యమంత్రిపైన గానీ, పార్టీలోని ఇతర నేతలపైనగానీ వంశీ ఎప్పుడూ విమర్శలు చేయలేదు. ఏ విషయంపైనైనా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేసిన సందర్భమూ లేదు. అలాంటిది హఠాత్తుగా ఆయన ఎందుకు రాజీనామా నిర్ణయం తీసుకున్నారో తెలియక టీడీపీ నేతలంతా కంగారు పడ్డారు. తర్వాత విషయం తెలిసి ఆయనకు సర్దిచెప్పారు. వివరాల్లోకి వెళ్తే…
హనుమాన్ జంక్షన్ లో ఉన్న డెల్టా షుగర్స్ సంస్థ నాలుగు నెలల క్రితం మూతపడింది. దీన్ని తణుకుకు మార్చాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడే ఉంచాలని, ఇక్కడి నుంచి తరలిస్తే ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతారని వంశీ గతంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చెరకు రైతులతో కలిసి సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు. అటు డెల్టా షుగర్స్ ను దక్కించుకునేందుకు ఆంధ్రా షుగర్స్, కేసీపీ షుగర్స్ పోటీపడుతున్నాయి. దీంతో షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న రైతులు తమ పంట నష్టపోకుండా చూసే బాధ్యతను ముఖ్యమంత్రి వంశీకి అప్పగించారు. రెండు పరిశ్రమల మధ్య ఏకాభిప్రాయం తెచ్చేందుకు వంశీ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆయన అనేక సార్లు సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రెండు పరిశ్రమల ప్రతినిధులతో సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశం జరిపారు. వంశీ కూడా సమావేశానికి హాజరయ్యారు. అయితే వంశీ రెండు పరిశ్రమల మధ్య ఏకాభిప్రాయం తెచ్చేందుకు ప్రయత్నించకుండా, ఓ పరిశ్రమకు మద్దతుగా ఈ సమావేశంలో పాల్గొంటున్నారని, ఇది సరికాదని సీఎంవో అధికారులు ఆరోపించారు. అంతేకాకుండా… అధికారులు ఆయనతో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా గిరిజా శంకర్ అవమానకరంగా వ్యవహరించినట్టు సమాచారం. అధికారుల తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన వంశీ కన్నీటి పర్యంతమై సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటికి వచ్చారు. వెంటనే రాజీనామా లేఖ రాసి… దాన్ని స్పీకర్ కు అందించేందుకు అసెంబ్లీకి వచ్చారు. వంశీ రాజీనామా లేఖను చూసి అందరూ షాకయ్యారు. విషయం తెలుసుకున్న తర్వాత మరో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్పీకర్ వద్దకు వెళ్తున్న వంశీని ఆపి, రాజీనామా లేఖను చించేశారు. విషయం లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వంశీని బుజ్జగించే బాధ్యతను కళావెంకట్రావుకు అప్పగించారు. ఆయన నచ్చజెప్పడంతో వంశీ మెత్తబడ్డారు.