ఏపీలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న క్రమంలో రోజుకొక ట్విస్ట్ తీసుకుంటున్నాయి అక్కడి పరిణామాలు. అయితే ఎన్నికల వేళ ఏపీలో అధికార పార్టీ టీడీపీకి మరో షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు పార్టీని వీడి వైకాపాలో చేరటం టీడీపీలో కలవరం రేపుతుండగా. ఈ కోవలోనే మరోవార్త ఆ పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. కోనసీమ ప్రధాన కేంద్రమైన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ప్రతిపక్ష పార్టీ వైకాపా వైపు చూస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాను పార్టీ మారడం లేదని, చంద్రబాబు నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని ఇటీవలే ఆయన క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని ఆయన మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్నారని మళ్ళీ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పండుల రవీంద్ర బాబు ఈ సారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.
అయితే ఎమ్మెల్యే టిక్కెట్టు సంగతి పక్కన పెట్టినా అమలాపురం ఎంపీ టిక్కెట్ విషయంలో కూడా టీడీపీ అధిష్టానం నుంచి ఎటువంటి హామీ లభించలేదు. గతకొంత కాలంగా ఈ విషయం మీద అధిష్టానంతో చర్చలు జరిపిన ఆయన అధిష్టానం వైఖరితో విసుగు చెంది వైసీపీలో చేరనున్నారని అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఏదో ఒక రిజర్వ్ డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రవీంద్ర బాబు వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశముంది. దీనిపై రెండ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకపక్క ఇప్పటికే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జన్‌రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అధికార పార్టీని వీడి వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే అమలాపురం ఎంపీ కూడా ప్రతిపక్ష పార్టీలోకి జంప్ కానున్నారన్న వార్త టీడీపీలో కలకలం రేపుతోంది. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన పండుల రవీంద్రబాబు తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో అమలాపురం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో ఇప్పటికే చంద్రబాబుకు వరుసగా షాక్‌లు తగులుతున్న నేపధ్యంలో రవీంద్రబాబు పార్టీని వీడితే చంద్రబాబుకు ఊహించని దెబ్బే అని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.