మాజీ మంత్రిని లైట్ తీసుకున్నారుగా !

TDP Note Focusing On Ravela Kishore Babu

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు పలువురు కీలక నేతలు కూడా సైకిల్ ఎక్కేశారు. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. టీడీపీకి చెందిన కొందరు నేతలు తమకు టికెట్ కష్టమేనేమో అనే ఉద్దేశ్యంతో పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కొద్దిరోజుల క్రితం చాలా కాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేశారు. అనంతరం ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వాస్తవానికి చాలా మంది నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలో చేరుతున్నా ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి పార్టీకి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. వాస్తవానికి రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్నవారికి కూడా దక్కనంత స్థాయి రావెల కిశోర్ బాబుకు చంద్రబాబు కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి బయటకు వచ్చీ రాక ముందే ఎమ్మెల్యే సీటు స్వాగతం పలికింది. నియోజకవర్గం అంతటా ప్రచారం నిర్వహించకపోయినా తెలుగుదేశం పార్టీని చూసి ఆయనకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు. ఏకంగా కీలక శాఖలతో కూడిన కేబినెట్‌ పదవి కూడా రావెలకు చంద్రబాబు కట్టబెట్టారు.

అయితే అందివచ్చిన అదృష్టాన్ని కూడా అంతే స్పీడుగా ఆయన చేజార్చుకున్నారు. అడగకుండానే ఓట్లేసిన నియోజకవర్గ ప్రజలకు దగ్గర కాలేకపోవటం వివాదాలను జేబులో వేసుకుని తిరగడం కారణంగా ఆయన మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. అయితే, ఇప్పుడు ఆయన పార్టీ మారినా తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ ఒక్క నేత కూడా రావెల పేరు ఎత్తడంలేదు. ముఖ్యంగా పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రావెల కిషోర్‌ పార్టీని వీడినప్పటికీ ఆయన వెంట వెళ్తున్నట్లు ఆ నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్యనేతలు ఎవరూ కూడా ప్రకటించకపోవడం, ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో పార్టీ బలం చెదరకుండా ఉండటం వంటి కారణాలతో అక్కడి పార్టీ శ్రేణులకు మరింత అండగా నిలవాలని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశించటంతో ముఖ్యనేతలంతా రంగంలోకి దిగుతున్నారు. ప్రత్తిపాడు గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా దృష్టి సారించారు.