కేసీఆర్‌ ధాటికి మహామహులే మట్టికరిచారు…మీరెంత ?

TRS MLA Criticises CBN

ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఏపీ సీఎం చంద్రబాబుపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ లో సీఎం కేసీఆర్ కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని అందుకే ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ధాటికి మహామహులే మట్టికరిచారని వీళ్ళెంత అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారని, కేసీఆర్ భాషను ఆయన తప్పు పడుతున్నారని ఆరోపించారు.

అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ,నేతలపై కూడా విమర్శలు గుప్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాం బీసీలపై మొసలి కారుస్తున్నారని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ ఫెడరేషన్లకు ఒక్క పైసా కూడా కేటాయించలేదని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు 90 శాతం సబ్సిడీతో పెట్టుబడి సమకూరుస్తున్నామని తెలిపారు. బీసీలను అన్ని విధాలా అణచివేసిన నేతలే ఇప్పుడు పెద్ద గొంతు చేసుకొని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని రాష్ట్రాల్లో తీర్మానాలు చేయించాలని నోముల డిమాండ్ చేశారు. బీసీలకు ఎవరేం చేశారో తేల్చుకునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని నోముల సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికలకు కోర్టు నిర్ణయించిన రిజర్వేషన్లనే ఫైనల్‌ చేశామని, తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల సాధనకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.