ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు మహమ్మారి కరోనా వైరస్ భయంకరంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కీలకమైన చర్యలను తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు నిరాహార దీక్ష చేపట్టడం అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్ డౌన్ చాలా కఠినంగా అమలులో ఉన్న కారణంగా రాష్ట్రంలోని పేదవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా టీడీపీ నేతలు పార్టీ కార్యాలయంలో 8 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు.
కాగా ఈ దీక్షలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్యే రామకృష్ణ బాబు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ శాసన సభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, రామానాయుడు పాల్గొన్నారు.అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల ఆర్ధిక సాయం అందించాలని, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా మూసేసిన అన్న క్యాంటిన్లను తెరిపించాలని, దానికి తోడు చంద్రన్న భీమా పథకాన్ని కూడా పునరుద్దరించాలని, ప్రజలందరినీ కూడా కాపాడాలని, ఆరోగ్యం విషయంలో కూడా ఎలాంటి అశ్రద్ధ కూడా వహించొద్దని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతులందరిని కూడా ఆదుకోవాలని, రైతులు పండించే పంటలను నాణ్యమైన ధర కట్టించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.