ఆంధ్రుడికి విషమ పరీక్ష…

TDP YSRCP and Janasena Fight against Modi Over AP Special Status

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా సహా విభజన చట్టం హామీల పోరాటం ఉదృతం అయ్యింది. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఈ పోరాటంలో తామే ముందున్నామని చెప్పుకునేందుకు తహతహలాడుతున్నాయి. అయితే చిత్రంగా ఈ పోరాటంలో టార్గెట్ కేంద్రం. కానీ మెజారిటీ పక్షాలు రాష్ట్ర ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ తరపున పోరాటంలో పాల్గొంటున్న పార్టీల మధ్యే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు అన్నది 2019 ఎన్నికల్లో తేలే విషయం. ఆ ఫలితాలు చూస్తే పోటీలో విజేత ఎవరో తేలిపోతుంది కానీ ఎవరిని విజేతగా నిలపాలి అన్న విషయంలో ఆంధ్రుడు ఇప్పుడు నిజమైన విషమ పరీక్ష ఎదుర్కొంటున్నాడు.

ప్రత్యేక హోదా పోరాటంలో పోటీ పడుతున్నది ప్రధానంగా మూడు పార్టీలు. మొదటిది అధికార టీడీపీ. రెండోది ప్రతిపక్ష వైసీపీ. ఇక మూడోది జనసేన. ఈ రేసులో ఒక్కో పార్టీది ఒక్కో వైఖరి. లక్ష్యం ఒక్కటే అని చెబుతున్నప్పటికీ వేర్వేరు దారుల్లో వెళుతున్నారు. నాలుగేళ్లు పాటు కేంద్రంలోని మోడీ సర్కార్ వైపు ఆశగా ఎదురు చూసిన చంద్రబాబు చివరి బడ్జెట్ తరువాత తిరుగుబాటు ప్రకటించారు. అయితే ఈ క్రమంలో ఆయన ఎదుర్కొంటున్న ప్రధాన సవాల్ ఒకటుంది. అదే… ఈ నాలుగేళ్లుగా ఎందుకు మౌనం వహించారని బాబు ప్రత్యర్ధులు నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నకు బాబు ఇస్తున్న జవాబు ఒక్కటే . ఈ నాలుగేళ్లు సహనంగా ఉండబట్టే ఈ మాత్రం అయినా రాష్ట్రానికి మేలు జరిగిందని లేకుంటే పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉండేదని బాబు చెబుతున్నారు. ఈ సమాధానానికి సాక్ష్యం అన్నట్టు వెనకబడిన జిల్లాలకి ఇచ్చిన నిధుల్ని కేంద్రం వెనక్కి తీసుకున్న వైనాన్ని చూపుతున్నారు. ఈ సమాధానం వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పటికీ రాజకీయ ప్రత్యర్ధులు ఆ విషయం జనం దృష్టికి చేరకుండా అడ్డుపడుతున్నారు.

ఇక వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక హోదా కోసమే ఎంపీ లతో రాజీనామా, నిరాహార దీక్ష అని చెబుతున్నప్పటికీ మోడీని పల్లెత్తి మాట అనకపోవడం జనాల్లో సందేహం కలిగిస్తోంది. ఇక జగన్ కి కుడిభుజం లా చెప్పుకునే విజయసాయి నిద్రలేస్తే మోడీ కి వంత పాడుతూ చంద్రబాబుని తిట్టడం వెనుక లోగుట్టు గురించి వైసీపీ ఏమి చెబుతున్నప్పటికీ జనాల్లో పెద్ద సందేహాలే వున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి కూడా ఇదే విధంగా వుంది. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు తుంగలో తొక్కిన మోడీని ఏమీ అనకుండా ఆంధ్రప్రదేశ్ హక్కులు గురించి పోరాటం చేస్తున్నట్టు చెప్పుకోవడం విడ్డురంగా వుంది.

ఈ ముగ్గురిలో ఎవరి బలహీనతలు ఎలా ఉన్నప్పటికీ వారికి కులం, మతం, అభిమానం ఆధారంగా మద్దతు పలుకుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా వుంది. అయితే వారి కన్నా ఏ పక్షపాతాలు లేకుండా ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితుల్ని బట్టి ఓటు వేసే వాళ్ళే నిజమైన నిర్ణేతలు. అలాంటి ఆంధ్రులు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ నాటకం చూసి అయోమయంలో పడుతున్నారు. అందులో నుంచి బయటపడి నిజమైన పోరాటం ఎవరిదో గుర్తించి వారికి మద్దతు ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ బతికి బట్టకడుతుంది. అందుకే పార్టీల కన్నా ఆంధ్ర ప్రజలే నిజమైన విషమ పరీక్ష ఎదుర్కొంటున్నారు.