ఇంగ్లాండ్ లో జరగబోయే వన్డే ప్రపంచకప్ లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు బయల్దేరింది. బుధవారం తెల్లవారుజామున ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి కోహ్లీసేన ఇంగ్లాండ్ పయనమైంది. కెప్టెన్ కోహ్లీ, ధోనీ సహా ఇతర ఆటగాళ్లు అధికార దుస్తుల్లో విమానాశ్రయంలో ఉన్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్ ద్వారా ప్రకటించింది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలర్లు బుమ్రా, చాహల్, హార్ధిక్ పాండ్యా కూడా ఆయా ఫొటోలను ట్వీట్ చేశారు. మే 30న వేల్స్ వేదికగా ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 5న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచ కప్ వేటను మొదలుపెట్టనుంది. ఇంగ్లాండ్ బయల్దేరే ముందు కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘వ్యక్తిగతంగా ఇది నాకు అత్యంత సవాల్ తో కూడుకున్న ప్రపంచకప్ అనిపిస్తోందనీ, ఏ జట్టు ఏ జట్టుకైనా షాకివ్వొచ్చని, ఫార్మాట్ ఇంతకు ముందులా లేదు కాబట్టి ప్రతి మ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఇదో భిన్నమైన సవాల్ అని దీనికి ఎంత ఎంత వేగంగా అలవాటు పడతామన్నది కీలకమని ఆయన పేర్కొన్నారు.