ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ చెలామణిపై ఆర్బీఐ ఆందోళన నేపథ్యంలో.. కేంద్రం సానుకూల కోణంలోనే స్పందించే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే క్రిప్టోకరెన్సీ ద్వారా ఆర్థిక నేరాలతో పాటు అమాయకులూ బలి అవుతారంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ కరెన్సీ విషయంలో కొత్త తరహా నేరాలు తప్పవని సైబర్ నిపుణులు సైతం వారిస్తున్నారు.
అందుకు ఉదాహరణగా తాజాగా రికార్డైన క్రిప్టోకరెన్సీ భారీ చోరీ కేసును ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఓ టీనేజర్ ఏకంగా 46 మిలియన్ కెనడా డాలర్లు క్రిప్టోకరెన్సీని కాజేశాడు. కెనడా హామిల్టన్‌కు చెందిన 17 ఏళ్ల ఆ పిలగాడు.. అంత డబ్బుతో ఏం చేశాడో తెలుసా? ఆన్లైన్ గేమింగ్‌లో అరుదైన ఓ యూజర్‌నేమ్‌ను కొనుగోలు చేశాడు. స్విమ్ స్కాపింగ్ ద్వారా ఆ టీనేజర్ ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
దీంతో టీనేజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక వ్యక్తి ఇంత భారీస్థాయిలో క్రిప్టోకరెన్సీ చోరీకి పాల్పడడం ఇదే తొలిసారి అని ప్రకటించారు. నిజానికి ఈ చోరీ జరిగింది కిందటి ఏడాదిలో. బాధితుడు కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జోష్ జోన్స్!. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది.
హామిల్టన్ సిటీ పోలీసుల సహకారంతో దర్యాప్తు కొనసాగించింది ఎఫ్‌బీఐ. అయితే అరుదైన ఆ యూజర్ నేమ్ దొంగను పట్టించింది. అంతేకాదు మొత్తం సొమ్ములో కేవలం ఏడు మిలియన్ల సొమ్ము మాత్రమే రికవరీ అయ్యిందని తెలుస్తోంది. కంటికి కనిపించని ఈ కరెన్సీని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని, లేనిపక్షంలో ఇలాంటి నేరాలకు గురై భారీగా మోసపోవాల్సి వస్తుందని క్రిప్టో ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్.