Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకం రాసిన కంచె ఐలయ్యపై తెలంగాణలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఐలయ్య వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఐలయ్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే ఆయనకే మంచిదని, ఒక కులాన్ని దూషించడం అనేది ఏ ఒక్కరికీ తగదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఐలయ్య పుస్తకంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆ పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ వైశ్యులు తకు వినతిపత్రం ఇచ్చారని మంత్రి చెప్పారు. ఐలయ్య వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఏ మేధావి కూడా ఈ పుస్తకాన్ని ఆమోదించబోడని, ఈ అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హరీష్ రావు వెల్లడించారు.
అటు ఐలయ్య పుస్తకానికి కౌంటర్ గా టీఆర్ ఎస్ ఎమ్మెల్యే గణేశ్ సామాజిక సేవకులు వైశ్యులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. వైశ్యులు సమాజానికి చేస్తున్న సేవలను ఈ పుస్తకంలో పొందుపర్చామని గణేశ్ తెలిపారు. ఐలయ్యపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కంచె ఐలయ్య పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నాడని, ఆయన్ను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో చేర్చుకోవాలని కోరారు. పిచ్చోళ్లు ఎక్కడున్నా… పట్టుకుపోయే ఎర్రగడ్డ ఆస్పత్రి..పెద్ద పిచ్చోడు అయిన ఐలయ్యను రోడ్డు మీద వదిలేసిందేమిటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు గణేశ్. ఐలయ్య లాంటివారు టెర్రరిస్టుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులని, విదేశీ ఏజెంట్ గా మారి దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు శ్రీపీఠం అధినేత పరిపూర్ణానంద స్వామి మరోసారి ఐలయ్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు కళ్లు లేని తన తల్లిని కూడా ఐలయ్య అవమానించారని.. స్వామి ఆవేదన వ్యక్తంచేశారు. లక్ష కోట్లు ఇస్తే బైబిల్ కు ప్రచారం చేస్తానని ఐలయ్య చెప్పారని, డబ్బుల కోసం దేశ రహస్యాన్ని, ధర్మాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. కోమట్లు లేకపోతే నిత్యావసరవస్తువులు ఎక్కడ దొరుకుతాయని స్వామి ఐలయ్యను ప్రశ్నించారు. ఐలయ్యకు వ్యతిరేకంగా అన్ని కులాలు ఒక్కటవుతున్నాయని, ఎదర్కోడానికి సిద్ధంగా ఉండాలని పరిపూర్ణానంద స్వామి హెచ్చరించారు.