కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దశ, దిశ, నిర్దేశం లేని పనికిమాలిన పసలేని బడ్జెట్ అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్యులకు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేసిందన్నారు. మసిపూసి మారేడుకాయ చేసిన గోల్మాల్ బడ్జెట్ ఇది. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు శూన్యం. దేశ చేనేత రంగానికి బడ్జెట్లో చేసిందేమీ లేదన్నారు.
నేతన్నలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు లేవని.. ఉద్యోగులు, చిరు వ్యాపారులను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్‌ల స్లాబ్‌లు మార్చకపోవడం విచారకరం. వైద్యం, ప్రజారోగ్యం, మౌలిక రంగాల అభివృద్ధిలో కేంద్రం నిర్లక్ష్యం వహించిందన్నారు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయకపోవడం విచారకరమన్నారు. వైద్య రంగంలో మౌలిక వసతుల పురోగతికి చర్యలు లేవన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని కేసీఆర్ అన్నారు.