తెరాస తో టీడీపీ పొత్తు…కెసిఆర్ ప్లాన్ ?

telangana cm kcr targeting to TDP party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలంగాణ రాజకీయాల్లో అధికార తెరాస కి బద్ధ శత్రువు ఎవరు అని అడిగితే తడుముకోకుండా టీడీపీ అని చెప్పేస్తారు. ఇక ఉద్యమ సమయం మొదలుకుని రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేసినంతగా తెలంగాణ సీఎం కెసిఆర్ ఇంకెవర్నీ చేయలేదు. ఇది ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు ప్రపంచానికి చెప్పాల్సిన కొత్త విషయం ఒకటి వుంది. తెలంగాణాలో తెరాస తో టీడీపీ కలిసి పనిచేసే అవకాశం కనిపిస్తోంది.

పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ వివాహ వేడుకల్లో చంద్రబాబు, కెసిఆర్ నవ్వులు ,పలకరింపులు చూసి అపార్ధం చేసుకుని చెబుతున్న మాటలు కావు ఇవి. టీడీపీ తో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి తెరాస కి ఎందుకు ఏర్పడిందో ఓ సారి చూద్దాం. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే తెరాస బలంగానే కనిపిస్తోంది. అయితే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఎలాగైనా తెలంగాణాలో తెరాస ని మట్టి కురిపించాలని తహతహలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఆ అడ్వాంటేజ్ వాడుకోడానికి ఉవ్విళ్లూరుతోంది. ఇక కులపరంగా చూసినా రెడ్లు కాంగ్రెస్ అండతో తెలంగాణాలో తిరిగి రాజకీయ ప్రాభవం చాటుకోడానికి రెడీ అవుతున్నారు. ఇక బీజేపీ కూడా కెసిఆర్ ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని కృతనిశ్చయంతో వుంది. ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ తో స్నేహం అంటూనే చంద్రబాబుని కంట్రోల్ చేయడానికి బీజేపీ ప్రయత్నించడం గమనించారు కెసిఆర్. రెండు జాతీయ పార్టీలు తెరాస ఓటమి కోసం ఒకరికి ఒకరు సహకరించుకునే అవకాశం ఉందనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరు ఔనన్నా కాదన్నా తెలంగాణాలో మరీ ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ లో టీడీపీ కి దాదాపు 10 శాతం లోపు ఓటు బ్యాంకు వుంది. ముక్కోణపు పోటీ తప్పనిసరి అయితే 1 శాతం ఓటు కూడా జాతకం తిరగబడేలా చేస్తుంది. అదే టీడీపీ తో పొత్తు కుదిరితే సీన్ మారిపోతుంది.

ఈ ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ని టీడీపీ తో పొత్తు దిశగా ఆలోచించేలా చేస్తోంది. ఆంధ్రాలో కూడా టీడీపీ,బీజేపీ మధ్య బంధం తెగిపోయేలా ఉండటం కూడా కెసిఆర్ ఆలోచనకి ఊపిరిలూదుతోంది. బీజేపీ గనుక నిజంగానే తమతో బంధం తెంచుకుని జగన్ వైపు మళ్లితే టీడీపీ కూడా ఈ పొత్తుకు సరే అనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అనూహ్య ప్రతిపాదన నిజరూపం దాల్చితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరన్న నానుడి ఇంకోసారి నిరూపితమవుతుంది.