అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలు బేరీజు వేయడంతో పాటు స్థానిక, లోక్‌సభ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై మూడు రోజులుగా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా గాంధీ భవన్ లో సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమావేశంలో కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగి నీళ్ల బాటిళ్లు విసురుకుని, చొక్కాలు చింపుకొన్నారు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. దీంతో గాంధీ భవన్ రణరంగమైంది. చివరికి పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్ళింది. తాజాగా జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల సమీక్ష జరిగింది. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, సలీం అహ్మద్‌లు పాల్గొన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ సమీక్ష సమయంలో సర్వే సత్యనారాయణ మాట్లాడుతుండగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఉత్తమ్, కుంతియాల పై సర్వే తీవ్ర విమర్శలు చేశారు.
ఓటమికి బాధ్యులైన వారే సమీక్షలు నిర్వహిస్తే ప్రయోజనం ఏముంటుందనే వ్యాఖ్యలతో పాటు వివిధ అంశాలను ఆయన ప్రస్తావిస్తుండగా కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్య నేతలపై తీవ్ర వ్యాఖ్యలు సరికాదని పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ వారించారు. దాంతో సర్వే సత్యనారాయణ, బొల్లు కిషన్‌లు పరస్పరం దూషించుకుని బాహాబాహీకి దిగారు. తీవ్ర గందరగోళం నేపథ్యంలో సర్వే సమావేశం నుంచి వెలుపలికి వచ్చేశారు. ఏఐసీసీ, పీసీసీ ముఖ్యనేతల సమావేశంలో జరిగిన ఈ ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని భేటీలో పాల్గొన్న పలువురు నేతలు డిమాండ్ చేశారు. సర్వేను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని సంతకాల సేకరణ కూడా చేపట్టారు. వెంటనే సర్వే సత్యనారాయణను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పీసీసీ ప్రకటించింది. కుంతియా, ఉత్తమ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ మీద దాడి నేపథ్యంలో సర్వేను సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అధిష్ఠానం ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.