నేడు తెలంగాణ ఇంజినీర్స్ డే ఉత్సవాలు

telangana engineers day celebrations

ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకొని గురువారం తెలంగాణ ఇంజినీర్స్ డే ఉత్సవాల్ని ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ చైర్మన్ టీ వెంకటేశం తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నదని చెప్పారు. బుధవారం ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధా న కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ కో చైర్మన్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, కార్యదర్శి చక్రధర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణశాఖ గౌరవ చైర్మన్ జీ రామేశ్వరరావు తదితరులతో కలిసి టీ వెంకటేశం.. కార్యక్రమ వివరాలను వెల్లడించారు.

ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ ఎస్కే జోషి, తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్‌రావు తదితరులు హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా నలుగురు సీనియర్ ఇంజినీర్లకు నవాజ్ జంగ్ మెమోరియల్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. విద్యుత్‌శాఖ నుంచి కే పెంటారెడ్డి, నీటిపారుదలశాఖ నుంచి పీ వెంకటరామారావు, రోడ్లు, భవనాలశాఖ నుంచి పీ కిషన్, మిషన్ భగీరథ నుంచి జ్ఞానేశ్వర్‌ను ఈ ఏడాది అవార్డులకు ఎంపికచేసినట్టు చెప్పారు. ఉదయం ఎర్రమంజిల్‌లోని జలసౌధలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ విగ్రహం వద్ద ఇంజినీర్లు నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రమేశ్ పాల్గొన్నారు.