Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక వ్యక్తి పుట్టిన రోజు… ఆ కుటుంబానికి మాత్రమే గొప్ప రోజు!
ఒక సంస్థ పుట్టిన రోజు ఆ సంస్థకు చెందిన వారికి మాత్రమే మరిచిపోలేని రోజు!!
కానీ, ఒక రాష్ట్రం అవతరించిన రోజు… ఖచ్చితంగా ఆ జాతి మొత్తం సంతోషపడే రోజు!!!
లక్షలాది కుటుంబాలు, సబ్బండ వర్ణాలు సంబరపడే రోజు!!!!
నాలుగేళ్ల క్రితం అరవయ్యేళ్ల చిమ్మచీకట్లు చీల్చుకుంటూ జూన్ 2న తెలంగాణ సూరీడు ఉదయించాడు! కలబడి తిరగబడి నిలబడిన నాలుగున్నర కోట్ల తెలంగాణా ప్రజలకి సంబురాన్ని తెచ్చాడు. జూన్ 2, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రాష్ట్రంలో, దేశంలో, విదేశాలలో ఉన్న తెలంగాణ వారందరిలో నవోత్సాహాన్ని నింపింది… ఎన్నెన్నో ఉద్వేగాలను గుర్తు చేస్తూ… మరెన్నో ఉత్తేజక్షణాలను జ్ఞాపకం చేస్తూ… అన్నింటినీ మించి ‘కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని అగ్రస్థానంలో నిలేబెట్టే ప్రయత్నంలో ఉన్న తెరాస సర్కారు ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలని భారీ ఎత్తున నిర్వహించనుంది.
రాష్ట్ర అవతరణ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకూ రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ప్రకటించారు. పాఠశాలలు జూన్ 1న ప్రారంభిస్తున్నందున, పాఠశాల విద్యార్థులనూ ఉత్సవంలో భాగస్వాములుగా చేయాలని, మూడు రోజుల పాటు పాఠశాలల్లో ఉత్సవాలను నిర్వహించాలని అనుకుంటున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పాఠశాలల ఆవరణలోనే వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జిల్లాకు కేటాయించిన 10 లక్షల రూపాయలలో 2 లక్షల రూపాయ లు సాంస్కృతిక కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన తెలిపారు.