మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు విషయమై ఇంకా తేలలేదు. తాము కోరినన్ని సీట్లు ఇవ్వాలని టీజేఎస్ పట్టుబడుతోంది. 9 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించింది. సీట్ల సర్ధుబాటు కోసం కాంగ్రెస్ పార్టీకి మరో రెండు రోజుల సమయాన్ని టీజేఎస్ కల్పించింది. తమకు కనీసం 16 సీట్లు కావాలని కోదండరామ్ కోరుతున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కు కేవలం 9 సీట్లు ఇచ్చేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంది. కానీ 16 సీట్లు ఇవ్వాలని టీజేఎస్ పట్టుబడుతున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే మహాకూటమితో పొత్తు, సీట్ల సర్ధుబాటు తదితర విషయాలను చర్చించేందుకు గాను టీజేఎస్ రాష్ట్ర కమిటీ అక్టోబర్ 12 వ తేదీన సమావేశం కానుంది.ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ఫైనల్ చేయనున్నారు. మరో వైపు పొత్తులను సీట్ల కోణంలో చూడొద్దని కోదండరామ్ అభిప్రాయపడుతున్నారు. మహాకూటమిలోని పార్టీల సమావేశం టీ తాగేందుకు మాత్రమే పరిమితమౌతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే రెండు రోజుల్లోపుగా సీట్ల సర్ధుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీ నుండి స్పష్టత రాకపోతే టీజేఎస్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సీట్ల పంపకాలపై త్వరగా తేల్చి, ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కోరుతున్నారు. సాగదీస్తూ పోతే పరిస్థితులు బలహీనపడతాయని ఉమ్మడి అజెండాను ప్రకటిస్తే దాన్ని ప్రజల్లో చర్చకు పెట్టే అవకాశం లభిస్తుందని, పొత్తులను సీట్ల కోణంలో చూడరాదని కోదండరామ్ సూచిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి ప్రయోజనాల కోసం సీట్ల పంపకాలను త్వరగా పూర్తి చేయాలని, మహాకూటమి కొనసాగాలన్నదే తమ అభిమతమని ఆయన అంటున్నట్టు తెలుస్తోంది.