Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరుతూ చేసిన ఓ ఆరోపణను గుర్తుతెచ్చుకోవాల్సిన సమయం వచ్చింది. మోత్కుపల్లి నరసింహులు వంటివారు టీడీపీలో ఉంటూనే టీఆర్ ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని, తెలంగాణ టీడీపీని టీఆర్ ఎస్ లో విలీనం చేయాలన్నది వారి ఆలోచన అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఈ ఆరోపణ చేసి పార్టీని వీడి నాలుగు నెలలైనా గడవకముందే… అచ్చంగా ఆయన చెప్పినట్టే జరుగుతోంది. ఎన్టీఆర్ వర్ధంతి వేళ ఆయనకు తిరుగులేని మద్దతు ప్రకటించిన తెలంగాణ గడ్డలో టీడీపీకి ఉనికేలేకుండా చేయాలన్న ఉచిత సలహా మోత్కుపల్లి నరసింహులు ఇవ్వడం పెనుసంచలనంగా మారింది.
తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు కాబట్టి పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్నది మోత్కుపల్లి సూచన. ఎన్టీఆర్ ఆత్మ శాంతించడానికి ఈ విలీనం అవసరమంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా తన బాధనూ వ్యక్తీకరించారు. విలీనం ఎందుకు అవసరమో తనదైన శైలిలో వివరించారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా పతనమైందన్న చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే టీడీపీని విలీనం చేయాలట. టీఆర్ ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆ పార్టీలో ఉన్నవారంతా టీడీపీ నేతలే కాబట్టి తెలంగాణ టీడీపీ విభాగాన్ని ఆ పార్టీలో విలీనం చేస్తే గౌరవప్రదంగా ఉంటుందట.
పార్టీ అంతరించిపోయిందన్న అవమానం కంటే ఒక మిత్రుడికి సాయం చేయడమే గౌరవం అట. ఇది చంద్రబాబుకు ఆయన ఇస్తున్న వ్యక్తిగత సలహా అట. ఇవన్నీ చెబుతున్న మోత్కుపల్లి జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారో…ఒకవేళ చేస్తే ఆ పార్టీకి జాతీయ స్థాయిలో దక్కే గౌరవం ఏమిటో మాత్రం చెప్పడం లేదు. మరో తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ..ఇంకో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలో విలీనమై ఉనికినే కోల్పోతే…ఆ ప్రభావం ఎలా ఉంటుందో మోత్కుపల్లికి అర్ధం కావడం లేదనుకోవాలా…లేక అర్థం అయినా కూడా స్వప్రయోజనాల కోసం పట్టించుకోవడం లేదా…నేతలంతా వ్యక్తిగత స్వార్థాలతో పార్టీ మారితే ఉన్న నేతలు..వాళ్లు లేని లోటును పూడ్చి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి కానీ…పార్టీకి ఉనికే లేకుండా చేయాలనుకోవడం సరికాదు.
మోత్కుపల్లి సూచనను ముఖ్యమంత్రి చంద్రబాబే కాదు..ఏ టీడీపీ నేతా హర్షించరు. విస్తృత క్యాడర్ ఉన్న పార్టీని మరో పార్టీలో విలీనం చేయాలన్న ఆలోచన సరైనది కాదన్న అభిప్రాయాన్ని తెలంగాణ టీడీపీ నేతలు వ్యక్తంచేస్తున్నారు. జాతీయ పార్టీ..ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనమవుతుందని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని టీఆర్ ఎస్ కు అప్పగించాలా..అని ఎద్దేవాచేశారు. మోత్కుపల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణలో పార్టీ క్యాడర్ నిరుత్సాహానికి గురవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ సైతం ఇలాంటి అభిప్రాయమే వ్యక్తంచేశారు. మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ తమ పార్టీలో అధికమని అన్నారు. నేతలు పార్టీ మారినప్పటికీ.. క్యాడర్ తమతోనే ఉంటుందన్నారు. ఎల్. రమణ చెప్పింది నిజమే. మోత్కుపల్లి అన్నట్టుగా `తెలంగాణలో టీడీపీ పూర్తిగా పతనమయ్యే పరిస్థితి ఎప్పుడూ రాదు. నేతలు పార్టీని వీడినప్పటికీ…తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి బలమైన క్యాడర్ ఉండడమే ఇందుకు నిదర్శనం.