మే 29 వరకు తెలంగాణ లాక్ డౌన్: కానీ ప్రజలకు ఊరటనిచ్చె విషయాలు ఇవే

తెలంగాణలో మే29వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. రాత్రి 7 గంటల తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుందని వెల్లడించారు. అలాగే.. మరికొద్దిరోజులు ఓపికపడితే మంచి ఫలితాలు వస్తాయని.. తెలంగాణలో టెస్టింగ్‌ కిట్ల కొరత లేదని తెలిపారు. రెడ్‌జోన్‌లో సిమెంట్‌, ఎలక్ట్రికల్‌, హార్డ్‌వేర్‌, స్టీల్‌ షాపులకు అనుమతి ఉంటుందని, వ్యవసాయరంగ పనులు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ వివరించారు.

కరోనా కనిపించని శతృవని, ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. కరోనాను జీరోకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని పిలుపునిచ్చారు. వివిధ జబ్బులతో చికిత్స పొందుతున్నవారు బయటకు రావొద్దని కేసీఆర్ సూచించారు. అలాగే.. ‘తెలంగాణలో సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, వికారాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ రెడ్‌జోన్‌లో ఉన్నాయి. యాదాద్రి, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, భద్రాద్రి, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి.

సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, జయశంకర్, కామారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల, మంచిర్యాల, నారాయణపేట, సిరిసిల్ల, నల్గొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ, కుమ్రం భీం, నిర్మల్‌, గద్వాల ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. ఆరెంజ్‌ జోన్‌లోని కొన్ని జిల్లాలు ఈరోజు గ్రీన్‌ జోన్‌లోకి వెళ్లబోతున్నాయి. కాగా వచ్చే 18 రోజుల్లో చాలా జిల్లాలు గ్రీన్‌ జోన్‌లుగా మారనున్నాయి. హైదరాబాద్‌లో కేవలం 12 కంటైన్మెంట్‌ జోన్లు కాబోతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్‌, రంగారెడ్డిలో రిస్క్‌ తీసుకోలేం. మొత్తం కేసుల్లో 726 కేసులు ఇక్కడే ఉన్నాయి. 29 మరణాల్లో 22 మంది జీహెచ్‌ఎంసీలోనే చనిపోయారు. నాలుగురోజుల నుంచి మొత్తం పాజిటివ్‌ కేసులు జీహెచ్‌ఎంసీలోనివే.’ అని కేసీఆర్ వివరించారు.

అంతేకాకుండా లాక్‌డౌన్‌ పొడిగిస్తూనే మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పారు. కేంద్రం ఇచ్చిన మినహాయింపుల కారణంగా మన రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు మద్యం అమ్మకాలు మొదలు పెట్టాయని తెల్పిన కేసీఆర్… సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రజలు మద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారని వెల్లడించారు. దీంతో తెలంగాణలో మద్యం ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని కేసీఆర్ వివరించారు. రెడ్ జోన్లలో కూడా మద్యం దుకాణాలు తెరుస్తామని తెలిపిన సీఎం కేసీఆర్.. కేవలం 15 కంటైన్మెంట్ జోన్లలో మాత్రం మద్యం షాపులు తెరవడం లేదని స్పష్టం చేశారు. అలాగే.. బార్లు, పబ్బులకు అనుమతి లేదని తెలిపిన ఆయన చీప్ లిక్కర్‌పై 11 శాతం పెంచబోతున్నామని… మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. కాగా వైన్ షాపుల వదద్ద భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని.. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వైన్ షాపులు తెరిచి ఉంటాయని… మాస్కులు ఉంటేనే షాపు యజమానులు మద్యం అమ్ముతారని సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.

ఇంకా 10వ తరగతి పరీక్షలపై కూడా కీలక విషయాలను వెల్లడించారు. మార్చి నెలలో హైకోర్టు ఆదేశాల కారణంగా పరీక్షలు నిలిచిపోయాయని గుర్తు చేసిన కేసీఆర్… త్వరలోనే పెండింగ్‌లో ఉన్న పదో తరగతి పరీక్షలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ నెలలోనే పరీక్షలు పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఎనిమిది పరీక్షలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని త్వరలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలను మరింతగా పెంచడం, వాటిని శానిటైజ్ చేయడం, విద్యార్థులకు మాస్కులు ఇవ్వడం వంటి చర్యలు తీసుకొని ఆ తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని కీలక విషయాలను వివరించారు. కాగా పరీక్షా సెంటర్లకు బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంకా ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయని… వాటి వాల్యువేషన్ కూడా సాధ్యమైనంత త్వరగా చేపట్టి ఫలితాలను వెల్లడిస్తామని కేసీఆర్ తెలిపారు. మొత్తానికి కేసీఆర్ మీడియా సమావేశంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పలు విషయాలకు తెరపడింది.