Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు మరణించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇందులో వాస్తవం లేదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ చెప్పారు. పోలీసులు చనిపోయారని చెబుతున్న హరిభూషణ్ తో పాటు రాజిరెడ్డి, దామోదర్ అందరూ క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు. కార్పొరేట్ శక్తులను కాపాడేందుకే ఎన్ కౌంటర్ జరిపారని మండిపడ్డారు.
ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ముందురోజు రాత్రే పోలీస్ బలగాలు చుట్టుముట్టాయని, కాలకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో ఏకపక్షంగా కాల్పులకు తెగబడ్డారని ఆరోపించారు. చనిపోయిన వారిలో కాజీపేట మండలం రాంపేట్ కు చెందిన దూడబోయిన స్వామి అలియాస్ సుధాకర్, బీజాపూర్ కు చెందిన రత్న ఉన్నారని… మిగిలిన వారంతా ఛత్తీస్ గఢ్ కు చెందిన వారని జగన్ తెలిపారు. శుక్రవారం ఉదయం తెలంగాణలోని వెంకటాపురం-చర్ల మండలాలు, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దుల వద్ద జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మరణించారు. ఓ గ్రేహౌండ్స్ కమెండో కూడా చనిపోయారు.