తమిళ బిగ్‌బాస్ కార్యక్రమంలో తెలంగాణ పోలీసులు ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపింది. అయితే వారు అందులో పాల్గొనేందుకు కాదు, ఓ కేసు విషయమై బిగ్‌బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్ చందర్ ని విచారించేందుకే వెళ్లారు. తన బిడ్డను అపహరించిందంటూ ఆమె రెండో భర్త ఫిర్యాదు చేయడంతో వనితా విజయ్ చందర్ ను పోలీసులు విచారించారు. తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన విజయ్ చందర్ మొదటి కూతురు వనిత 2000 సంవత్సరంలో ఆకాశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. కొంతకాలం తర్వాత రాజన్ ఆనంద్ అనే వ్యక్తి రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఓ అమ్మాయి పుట్టింది. అయితే కుటుంబ కలహాల కారణంగా వారిద్దరూ 2012లో విడిపోయారు. విడాకుల సమయంలో కుమార్తె తండ్రి దగ్గరే ఉంటుందని, తల్లి ఎప్పుడైనా వెళ్లి చూడొచ్చని కోర్టు తీర్పు చెప్పింది. అయితే అప్పటి నుండి ఆనందరాజ్ తన బిడ్డతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో తన కుమార్తెని వనిత తీసుకు వెళ్లిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్ ప్రారంభ కార్యక్రమంలో వనిత తన కూతురితో కలిసి పాల్గొనడాన్ని పోలీసులు గమనించారు. దీంతో మంగళవారం రాత్రి చెన్నై చేరుకున్న హైదరాబాద్ పోలీసులు చెన్నై పోలీసుల సాయంతో బిగ్‌బాస్-3 హౌస్‌కు వెళ్లారు. వనితను సుమారు రెండు గంటల పాటు విచారించగా బుధవారం చిన్నారిని అప్పగిస్తానని చెప్పారు. నిన్న బిగ్‌బాస్ హౌస్‌కు బాలికను తీసుకురాగా ఆమె తన తల్లితోనూ ఉంటానని చెప్పింది. దీంతో పోలీసులు వెనుదిరిగారు.