అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌‌ మృతి

అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌‌ మృతి

అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి అతడి కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. గత నెల 27 చనిపోయినా అతడి మరణవార్తను బుధవారమే అందుకున్న ఆ కుటుంబం ఇప్పుడు గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బోడుప్పల్‌ మేడిపల్లికి చెందిన పానుగంటి శ్రీధర్‌ అమెరికాలో ఆరేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. న్యూయార్క్‌ సిటీలోని బాఫెల్లాలో నివాసముండే అతడికి భార్య ఝాన్సీ, కుమారుడు శ్రీజన్‌(5) ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో సోదరుడి వివాహం నిమిత్తం భార్య ఝాన్సీ, శ్రీజన్‌ ఇండియాకు వచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే ఉండిపోయారు.

అప్పట్నుంచి శ్రీధర్‌ యూఎస్‌లో ఒంటరిగానే ఉంటున్నారు. వీరియోగక్షేమాల్ని ఎప్పటికప్పుడు ఫోన్‌లోనే తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో గతనెల 26న భార్య సెల్‌కు కుమారుడి బాగోగులపై శ్రీధర్‌ మెసేజ్‌ పంపించాడు. దీనికి ఆమె బాగున్నాడని బదులిచ్చారు. ఆ తర్వాత 27 ఉదయం భార్య ఝాన్సీ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా శ్రీధర్‌ నుంచి సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఝాన్సీ.. అపార్ట్‌మెంట్‌లో పక్కనే నివాసముండే వారికి ఫోన్‌ చేసింది. దీంతో వారు అమెరికా పోలీసులకు సమాచారమివ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీధర్‌ నిద్రలోనే మరణించాడని నిర్ధారించారు.