ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న బాపినీడు హైదరాబాద్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 83 సంవత్సరాలు. విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. 1936 సెప్టెంబర్ 22న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రులో జన్మించారు. ఏలూరు సీఆర్ఆర్ కాలేజీలో బీఏ పూర్తిచేసిన బాపినీడు కొంతకాలం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. తరవాత చెన్నైలో ‘బొమ్మరిల్లు’, ‘విజయ’ మ్యాగజైన్లను ప్రారంభించారు. ‘విజయ’లో బాపినీడు రాసే సినిమా రివ్యూలు అప్పట్లో విపరీతంగా ప్రేక్షకాదరణ పొందాయి. దీంతోనే ఆయన పేరు విజయ బాపినీడుగా మారి పోయింది. ఆ తరవాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాపినీడు.. 1981లో దర్శకుడిగా మారారు. ‘డబ్బు డబ్బు డబ్బు’ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్న బాపినీడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి డజను బ్లాక్ బస్టర్ హిట్లను అందించారు. చిరంజీవితో ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగ మహారాజు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘హీరో’, ‘మగధీరుడు’ సినిమాలతో పాటు మెగాస్టార్ వందో చిత్రం ‘ఖైదీ నంబర్ 786’ను కూడా విజయ బాపినీడే తెరకెక్కించడం విశేషం.
వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే. చిరంజీవి తరవాత రాజేంద్ర ప్రసాద్‌తో బాపినీడు అత్యధిక సినిమాలు తెరకెక్కించారు. శోభన్‌బాబు, క్రిష్ణ, మోహన్‌బాబు వంటి సీనియర్ నటులతోనూ పనిచేశారు. దర్శకుడిగా 22 సినిమాలు తెరకెక్కించిన బాపినీడు శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘యవ్వనం కాటేసింది’ సినిమాను నిర్మించారు. అలాగే స్నేహితులతో కలిసి మరో 12 చిత్రాలను నిర్మించారు. విజయబాపినీడు అంతక్రియలు గురువారం హైదరాబాద్ మహా ప్రస్థానం లో నిర్వహిస్తారు. అమెరికా లో ఉన్న ఆయన పెద్దమ్మాయి రావడానికి సమయం పడుతున్న కారణం గా అంత క్రియలు గురువారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయబాపినీడు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సిఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.