ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య !

Telugu Serial Actress Suicide

బుల్లితెర‌పై ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి ఝాన్సీ ఈ రోజు ఉదయం ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని సాయి అపార్ట్‌మెంట‌లో నివ‌సిస్తున్న ఆమె ప్రేమ విఫ‌లం కార‌ణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తాను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంట‌నే దానిపై పోలీసుల ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. మా టీవీలో ప్ర‌సార‌మ‌య్యే పవిత్ర బంధం సీరియ‌ల్‌తో పాటు ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో నటిస్తుంది ఝాన్సీ. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని కడలి గ్రామానికి చెందిన ఝాన్సీ, సినిమాల్లో అవకాశాలు వెదుక్కొంటూ హైదరాబాద్‌కు వచ్చింది. పవిత్రబంధం సీరియల్‌తోపాటు మరో రెండు సినిమాల్లోనూ నటించిన ఆమె, తన తల్లి, సోదరుడితో కలిసి శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటోంది.

అయితే సూర్య అలియాస్ నాని అనే వ్యక్తితో పరిచయం అయిన తర్వాత ఝాన్సీ సీరియల్స్ మానేసిందని ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. వివాహం చేసుకోమంటే అతడు ముఖం చాటేసినట్టు తెలిపారు. సూర్య తనను మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురైన ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. మంగళవారం రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఝాన్సీని, ఆఫీసు నుంచి వచ్చిన ఆమె సోదరుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, అప్పటికే ఆమె మృతిచెందినట్టు నిర్ధరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.