తమ రిటైర్మెంట్పై కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు అమెరికా టెన్నిస్ ‘ట్విన్ బ్రదర్స్’ బాబ్ బ్రయాన్–మైక్ బ్రయాన్ తెరదించారు. తాము టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు, ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని సామాజిక మాధ్యమం ద్వారా 42 ఏళ్ల బాబ్–మైక్ అధికారికంగా ప్రకటించారు. గత ఏడాది చివర్లో 2020 సీజన్ తమకు చివరిదని వీరు ప్రకటించారు. దాంతో స్వదేశంలో జరిగే గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ యూఎస్ ఓపెన్‌లో ఘనంగా ఆటకు వీడ్కోలు పలుకుతారని అందరూ భావించినా… వారం క్రితం ప్రకటించిన యూఎస్ ఓపెన్ ప్రధాన ‘డ్రా’లో వీరి పేర్లు లేకపోవడంతో ఈ ఇద్దరి రిటైర్మెంట్పై ఊహాగానాలు మొదలయ్యాయి.
తాజాగా వీటిపై స్పష్టత ఇస్తూ ఇరువురు కూడా ఒకేసారి టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పారు. అచ్చుగుద్దినట్లు ఉండే ఈ అమెరికా కవల జంటలో ఎవరు మైక్ (మైకేల్ కార్ల్ బ్రయాన్), ఎవరు బాబ్ (రాబర్ట్ చార్లెస్ బ్రయాన్) అని తేల్చుకోవడం చాలా కష్టం. కవల పిల్లలైన వీరిలో మైక్… బాబ్ కంటే రెండు నిమిషాలు పెద్దవాడు. 1995లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో జంటగా బరిలో దిగిన వీరు… ఇక వెనుతిరిగి చూడలేదు. 2003లో ఫ్రెంచ్ ఓపెన్ విజయంతో తొలిసారి కెరీర్లో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెల్చుకున్న వీరు… అనంతరం జంటగా వీరు 16 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌ను కొల్లగొట్టారు.
2008 ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకున్న ఈ జంట… 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని సాధించింది. 26 ఏళ్ల వీరి కెరీర్లో 2013వ సంవత్సరం మరపురానిది. ఆ ఏడాది ఈ జంట నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లో మూడింటిని (యూఎస్ ఓపెన్ మినహా)ను గెలవడంతో పాటు, 5 ఏటీపీ మాస్టర్స్ టైటిల్స్‌ను సాధించింది. ఇక టూర్ లెవల్ ఫైనల్స్‌లో 11–4 గెలుపోటముల రికార్డును నమోదు చేసింది. వీరి రిటైర్మెంట్పై భారత మాజీ డబుల్స్ ఆటగాడు మహేష్ భూపతి స్పందించాడు. ‘అద్భుతమై కెరీర్‌కు వీడ్కోలు పలికిన సోదరులకు నా అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు.