తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు రోజుకు 11 లక్షల మంది ప్రయాణిస్తే ఉచిత ప్రయాణం పథకం మొదలయ్యాక ఇప్పుడు 18 నుంచి 20 లక్షల వరకూ పెరిగారు. ఉదయం, సాయంత్రం కార్యాలయాలు, కళాశాలల సమయంలో సిటీ బస్సులు మరింత రద్దీగా మారుతున్నాయి. సోమ, బుధవారం మరింత కిక్కిరిసిపోతున్నాయి.
ఈ పరిస్థితుల్లో బస్సు నిండా సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులు బాటుగా ఉండడం లేదని భావించిన ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ .. కొన్ని సీట్లు తొలగిస్తే మరింత మందికి చోటు దొరికే అవకాశం ఉంటుందని బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లు తొలగించింది. అదే స్థానంలో ఇరు వైపులా మెట్రో రైలు మాదిరి సీటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులు బాటు చేసింది. ప్రయోగాత్మకంగా కొన్ని మార్గాల్లోని బస్సుల సీటింగ్ టీఎస్ ఆర్టీసీ మార్చింది.