తెలంగాణ రోజురోజుకు నిప్పుల గుండంలా మారుతోంది. ఉష్ణోగ్రతలు రానురాను పెరుగుతున్నాయి. ఉదయం 9 దాటితే అడుగు బయట పెట్టాలంటే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మధ్యాహ్నం పూట ఎండ మరింత దంచికొడుతోంది. సూర్యుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉన్నా ఉక్కపోత తప్పడం లేదంటూ వాపోతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలకు చేరుకున్నాయి.
మంగళవారం రోజున తొమ్మిది జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాచలం పట్టణంలో 44.7 డిగ్రీల సెల్సియస్, నల్గొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాల్లో అనేక మండలాల్లో 44.5 డిగ్రీలపైన నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం నగరంలో సాధారణం కన్నా 5.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరగడంతో వడగాలులు వీస్తున్నట్లు వెల్లడించారు. బుధ, గురువారాల్లోనూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. వడగాలులు వీసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని చెప్పారు.