Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చిన్న తమ్ముడు ఇక్బాల్ కస్కర్ ను థానే పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా ఉన్న ఓ బిల్డర్ ను డబ్బులు ఇవ్వమని బెదిరించిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. బిల్డర్ ను నాలుగు ఫ్లాట్లు, రూ. 30 లక్షల డబ్బు ఇవ్వాలని కస్కర్ బెదిరించాడని థానే పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు. ఇంతకీ సోమవారం అర్ధరాత్రి కస్కర్ ను అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా…? ఆ సమయంలో సోదరి హసీనా పార్కర్ ఇంట్లో ఉన్న కస్కర్ దర్జాగా కూర్చుని ఓ పక్క బిర్యానీ తింటూ… ఇంకో పక్క కౌన్ బనేగా కరోర్ పతి కార్యక్రమం చూస్తున్నాడు.
కస్కర్ ఇంట్లో ఉన్న విషయం తెలుసుకున్న థానే ఏఈసీ బృందం అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకుంది. అరెస్టు అనంతరం కస్కర్ ను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ నిమిత్తం కస్కర్ తో పాటు మరో ఇద్దరిని ఎనిమిది రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. దోపడీ రాకెట్ నడుపుతున్నట్టు కొన్ని రోజులుగా కస్కర్ పై ఫిర్యాదులు అందుతున్నాయి. థానే, ముంబై, నవీ ముంబై ప్రాంతాల్లోని కొంతమంది బిల్డర్లను కస్కర్ డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. ముంబై పేలుళ్ల అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తలదాచుకున్న కస్కర్ ను ఒక హత్య కేసు, అక్రమ నిర్మాణానికి సంబంధించిన కేసులో ముంబై పోలీసులు 2003లో అరెస్టు చేసి భారత్ కు తీసుకొచ్చారు. అయితే 2007లో ఈ కేసుల నుంచి కస్కర్ నిర్దోషిగా విడుదలయ్యాడు. తాజాగా ఆర్థిక లావాదేవీల కేసులో అరెస్టయ్యాడు.