సినీ నటుడు షాయాజీ షిండే దేవాలయాల్లో ప్రసాదంతో పాటు, భక్తులకి ఒక మొక్కని ఇస్తే బాగుంటుందని, తాను ఇప్పటికే ఈ పని చేస్తున్నానని చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన ‘మా నాన్న సూపర్‌హీరో’ మూవీ ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ సీజన్-8కి వచ్చిన షాయాజీ షిండే గుడిలో ప్రసాదంతో పాటు మొక్కని కూడా ఇస్తే బాగుంటుందని, అందుకోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ ఇస్తే, తన ఆలోచనని ఆయనతో పంచుంటానని షాయాజీ షిండే చెప్పుకొచ్చారు .
ఈ సందర్భంగా షాయాజీ షిండే మాట్లాడుతూ.. ‘మా అమ్మగారు 97లో కాలం చేశారు. నా దగ్గర డబ్బు ఉన్నా.. నేను ఆమెని బతికించుకోలేకపోయాను. ఐతే, మా అమ్మగారి బరువుకి సమానమైన విత్తనాలను తీసుకుని, ఇండియా మొత్తం నాటుతానని నేను ఆమెకి చెప్పాను. నేను నాటిన చెట్లు కొన్నాళ్లకి పెరిగి నీడను ఇస్తాయి. పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తుకు వస్తుంది. సాధారణంగా ఆలయాలకు వెళ్లిన వాళ్లకి ప్రసాదాలు పంచి పెడతారు. ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇస్తే బాగుంటుంది. దాన్ని భక్తులు తీసుకెళ్లి నాటితో అందులో భగవంతుడిని చూసుకోవచ్చు’ అని షాయాజీ షిండే తెలిపారు.