దొంగలందు ఘరానా దొంగలు వేరయా అని అవీ ఇవీ ఎత్తుకు వెళితే ఏమి వస్తుంది అనుకున్నారో ఏమో ఏకంగా ఎవరికీ అనుమానమే రాకుండా 56 టన్నులు, 75 అడుగుల పొడవైన వంతెనను లేపేశారు. మామూలుగా చూడడానికే వామ్మో అనిపించేంత ఉన్న ఆ వంతెనను ఎత్తుకెళ్లిపోయారంటే వారు ఎంత తెలివిగా ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఐకువెన్, లొవోజిరో ప్రాంతాలను కలుపుతూ ఉంబా నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ శిథిలావస్థకి చేరడంతో అటుగా రైళ్ల రాకపోకలను నిలిపేశారు. ఈ వంతెన మధ్య భాగం నీటిలో పడిపోయిన ఫొటో ఒకటి మే 16న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మే 26న అధికారులు విడుదల చేసిన ఫొటోలో నీటిలో కూలిన వంతెన భాగం కూడా కనిపించలేదు. ఈ ఘటనపై మీడియా అధికారులను ప్రశ్నించగా ఆ శిథిలాలను తాము తొలగించలేదని తెలిపారు. దీంతో ఆ వంతెన దానంతట అదే కూలలేదని, దొంగలే దాన్ని కట్ చేసి నదిలో పడేశారని, ఆ తర్వాత ముక్కులు చేసి ఎత్తుకుపోయారని తెలిసింది. నది ప్రవాహం సాధారణంగానే ఉండటంతో అది ప్రకృతి వల్ల చోటుచేసుకోలేదని నిర్ధారించారు. ఈ ఘటనపై స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ మొదలుపెట్టారు.