కూటమి ఓటమికి కారణం సైకిలా ? హస్తమా…?

The Cause Of Mahakumatis Defeat Is Chandrababu

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులు చంద్రబాబును వీరుడు శూరుడు అంటూ ఆకాశానికికెత్తిన మీడియా…. మహాకూటమి ఓటమి పాలైన సందర్భంగా బాబు ఊసేలేకుండా వార్తలు ప్రచురించాయి. ప్రసారం చేస్తున్నాయి. తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఊపు వచ్చిందని, హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఉన్న ఫాలోయింగ్‌ చూసి రాహుల్‌ గాంధీ కూడా ఆశ్చర్యపోయారని, కూటమి కింగ్‌ చంద్రబాబే అని రకరకాలుగా కథనాలు ప్రచురించి, ప్రసారం చేసిన మీడియా ఇప్పుడు ఆ కోణంలో విశ్లేషణలు చేయడానికి ఇష్టపడటం లేదు. తెలుగుదేశం పార్టీ – కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం. కాంగ్రెస్‌-టిడిపి పొత్తును రెండు పార్టీల కార్యకర్తలు, ఓటర్లు జీర్ణించుకోలేదు. అందుకే ఓట్ల బదిలీ జరగలేదు. కొందరు ఇతర పార్టీలకు ఓట్లు వేశారు. అయితే ఈ విషయం మీద సీనియర్లు ఇప్పటి దాకా ఏమీ మాట్లాడకపోయినా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనన్నారు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. టీడీపీతో పొత్తు వద్దని తాను ముందే వ్యతిరేకించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

mahakutami

తన మాటలను కొందరు నేతలు పట్టించుకోకపోవడం వల్లే తెలంగాణలో ఓడిపోయామన్నారు. టీడీపీతో పొత్తు వల్ల కలిసిన నష్టాన్ని త్వరలోనే హైకమాండ్‌కు వివరిస్తానని విజయశాంతి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లోపు జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని అధిష్ఠానానికి సూచిస్తానన్నారు. టీడీపీతో పొత్తు కొనసాగితే కాంగ్రెస్‌కు మరింత నష్టం జరుగుతుందని విజయశాంతి హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పొత్తు పెట్టుకుని ప్రజాకూటమి పేరుతో పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కే తిరిగి పట్టం కట్టారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును ఓటర్లు తిరస్కరించారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేయడం వల్లనే ప్రజాకూటమి ఓటమి పాలైందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే మరోపక్క తెలంగాణలో మహాకూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహేనని టీడీపీ నేత అభిషేక్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దామోదర స్వార్థ రాజకీయాలు మహాకూటమి కొంప ముంచాయని ఆరోపించారు. మెదక్ జిల్లాలో ఆయన టికెట్లను అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన అభిషేక్.. దామోదరను వెంటనే ఆందోల్ ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో టీడీపీతో పొత్తే కాంగ్రెస్ కొంప ముంచిందని విజయశాంతి సహా పలువురు నేతలు ఆరోపిస్తుంటే అభిషేక్ మాత్రం మహాకూటమి ఓటమికి దామోదర కారణమంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. అయితే, జానారెడ్డి వంటి సీనియర్ నేతలు మాత్రం కాంగ్రెస్ ఓటమికి టీడీపీ కారణం కాదని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్‌ను ప్రజలు ఇంకా ఆదరించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.