ఈవ్ టీజింగ్ చేస్తే వద్దన్నాడని  సీఎం కమాండోనే చంపేశారు

the-cm-commando-was-killed-by-eve-teasing

ఒక మహిళను వేధిస్తున్న వ్యక్తిని వారించాడనే ఆగ్రహంతో పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ సెక్యూరిటీ కమాండోను ఓ యువకుడు కాల్చిచంపిన ఘటన మొహాలీలో వెలుగుచూసింది. క్లబ్‌లో మహిళను అసభ్యంగా తాకుతూ వెకిలిచేష్టలకు పాల్పడిన నిందితుడు చరణ్‌జిత్‌ సింగ్‌ను పంజాబ్‌ పోలీస్‌ 4వ కమాండో బెటాలియన్‌కు చెందిన సుఖ్వీందర్‌ కుమార్‌ వారించారు.

ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో నిందితుడు చరణ్‌జిత్‌ సింగ్‌తో పాటు అతని స్నేహితులను నిర్వాహకులు బయటకు పంపారు. అదే సమయంలో సుఖ్వీందర్‌ కూడా వెలుపలికి రావడంతో అక్కడే మాటువేసిన నిందితుడు మరోసారి బాధితుడితో ఘర్షణకు దిగాడు.

ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో చరణ్‌జిత్‌ బాధితుడిపై తన గన్‌తో కాల్పులు జరిపి పరారయ్యాడు. బుల్లెట్‌ గాయాలతో సుఖ్వీందర్‌ మరణించారు. కాగా నిందితుడిని గుర్తించామని, అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని మొహాలీ ఎస్‌ఎస్పీ కుల్దీప్‌ సింగ్‌ వెల్లడించారు. హత్య జరిగిన పార్కింగ్‌ ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారని చెప్పారు.