లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. జీతాలు లేక ఒకపక్క.. ఇంటి అద్దె కట్టలేక మరోపక్క.. సొంత ఊరికి పయనమవుతున్నారు. కొంత మంది కాళ్ళు అరిగేలా వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. కాగా మరి కొందరు తమ మెదడుకు పని పెట్టి వ్యూహాలు రచిస్తున్నారు. సొంతూరికి వెళ్ళడానికి ఓ వ్యక్తి ఏకంగా శవం గెటప్ వేసి దొరికి పోయాడు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో చోటు చేసుకుంది.
లాక్ డౌన్ సమయంలో సొంతూళ్లకు వెళ్లడానికి ముగ్గురు వ్యక్తులు ప్లాన్ వేశారు. వారిలో ఒక వ్యక్తి చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. గ్రామానికి వెళ్లేందుకు ఆంబులెన్స్ ను అద్దెకు తీసుకొని ప్రయాణం మొదలు పెట్టారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి మరణించినట్లు నటించాడు. శవాన్ని తమ గ్రామానికి తీసుకెళ్తున్నామని చెక్‌పోస్ట్ ల వద్ద పోలీసులకు తెలిపారు.
అలా కొన్ని చోట్ల తప్పించుకున్నారు. సూరన్ కోట్ చెక్‌పోస్ట్‌కు చేరుకోగానే పోలీసులు అనుమానం వచ్చి అంబులెన్స్ ను తనిఖీ చేశారు. అందులో శవంలా ఉన్న వ్యక్తికి టెంపరేచర్ చూడగా బతికే ఉన్నాడని పసిగట్టారు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు డ్రైవర్, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారిపై సెక్షన్ 420 (మోసం), 269 (జీవితానికి ప్రమాదకరమైన వ్యాధి సంక్రమణను వ్యాప్తి చేసే నిర్లక్ష్య చర్య), 188 (ప్రభుత్వ సేవలకు ఆటంకం) కింద కేసు నమోదు చేశారు.