శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ప్రకటించనుంది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళల ప్రవేశం నిషేధించడాన్ని సవాలు చేస్తూ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ఆగస్టు 1 నుంచి 8 రోజులపాటు ఇరు వర్గాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆనాడు తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పును ఈరోజు వెలువరించనుంది. మహిళలల్లో వచ్చే రుతుస్రావం కారణంగా 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళలు కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉంది.
అయితే ఈ చర్య లింగసమానత్వానికి విరుద్ధమంటూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మరి కొందరు కూడా ఇదే విషయమై సుప్రీంలో పిటిషన్లు వేశారు. కానీ అయ్యప్పస్వామి ‘అస్కలిత బ్రహ్మచారి’ అని అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తూ, రుతుస్రావం వచ్చే అమ్మాయిలను, మహిళలను ఆలయంలోకి అనుమతించడంలేదని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేసుకోవడం మహిళల రాజ్యాంగ హక్కు అనీ, ఈ విషయంలో లింగ వివక్షకు తావులేదని అలా నిషేధం విధించడం మహిళల హక్కులను కాలరాయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. రాజ్యంగంలోని ఆర్టికల్ 25, 26ల ప్రకారం పురుషులకు వర్తించేవన్నీ మహిళలకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈరోజు దానికి సంబందించిన తీర్పు వెలువరించనుంది.