పెళ్లై నెలరోజులే.. అంతలోనే అక్క మోసంతో.. చెల్లి బలి

ఆంధ్రప్రదేశ్ లో ఘోరం జరింగింది. పెళ్లై నెలరోజులే అయ్యింది. పండంటి కాపురం చక్కగా సాగుతోంది. ఇంతలో సొంత అక్కా బావ చేసిన మోసం బయటపడింది. ఆ బాధను భరించలేక చెల్లి అర్థాంతరంగా తనువు చాలించింది.

కోటి ఆశలతో కొత్త జీవితం మొదలు పెట్టిన చెల్లికి అక్కా.. బావ చేసిన మోసాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. అయితే వాళ్లు అన్న మాటలు పడలేక.. ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. గుడివాడ ఒకటో పట్టణ పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం.. బేతవోలు నిమ్మతోటలో నివాసముంటున్న వీరంకి గంగారావు, చుక్కమ్మల ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురుకి ఎప్పుడో పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ మధ్యే చిన్నకూతురు మౌనికకు పెళ్లైంది.

అయితే గత నెలలో కొడాలికి చెందిన డేనియల్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఇద్దరి బాధ్యత తీరిందనుకున్నారు తల్లిదండ్రులు. ఇంతలో పెద్ద కూతురు రూపంలో కష్టాలు వచ్చి పడ్డాయి. పమిడిముక్కల మండలం వీరంకిలాకులో నివాసముండే పెద్దకూతురు బొల్లా నాగలక్ష్మి అల్లుడు శ్రీనివాసరావు ఇంటికి వచ్చారు. ఇల్లుకట్టుకుంటున్నామని.. బ్యాంక్ ష్యూరిటీ కోసం పొలం డాక్యుమెంట్లు ఇవ్వాలని అడిగారు. దానికేముంది అంటూ … కన్నకూతురు మాటలు గుడ్డిగా నమ్మిన నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు పొలం పత్రాలు కూతురు, అల్లుడు చేతిలో పెట్టారు.

ఇక్కడే ట్విస్ట్ ఇచ్చారు కూతురు, అల్లుడు. ఏం చేశారో తెలుసా.. తల్లిదండ్రులను మోసం చేసి ఆ భూమిని తమ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అయితే గత నెలలో చిన్న కూతురు మౌనిక పెళ్లైంది. కట్నం కింద ఎకరంన్నరలో అర ఎకరం ఆమె పేరుతో తల్లిదండ్రులు రాశారు. ఆ భూమి డాక్యుమెంట్లు కావాలని తమ పెద్ద కుమార్తెను కోరారు. వారు ఇదిగో అదిగో ఇస్తామని చెప్తూ వచ్చి చివరకు భూమి తమపేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నామని.. ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.

దీంతో మౌనిక కోపంతో అక్కబావలను ఫోన్లోనే కడిగేసింది. ఆమెను వారికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ తిట్లను భరించలేక చెల్లి, భర్త ఇంట్లో లేని సమయంలో శుక్రవారం పొలం కోసం తెచ్చిన గుళికలు తినేసింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి మృతి చెందింది. తల్లి చుక్కమ్మ ఫిర్యాదు మేరకు పెద్ద కూతురు బొల్లా నాగలక్ష్మి, అల్లుడు శ్రీనివాసరావు, మనమలు సాయి, మరో బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గాప్రసాద్‌ వెల్లడించారు