Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేడు ఉదయం నుండి జరుగుతున్న పరిణామాలు మీడియా వర్గాల్లో మరియు సినీ జనాల్లో చర్చకు తెర లేపుతున్నాయి. ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు నాగబాబుతో పాటు చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా పలువురు ఛాంబర్‌కు వెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ మొదట ప్రెస్‌మీట్ పెడతారని అంతా భావించారు. కాని పవన్ మొదట ధర్నా చేస్తాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి కొందరు పవన్ లోపల మా వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని, తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన, చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. తర్వాత మూడు గంటల సమయంలో పవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన డిమాండ్స్‌ను చెబుతాడని కూడా కొంత మేరకు ప్రచారం జరిగింది. అదంతా ఏమీ లేకుండానే పవన్ తన నిరసనను ముగించేసి సింపుల్‌గా ఇంటికి వెళ్లాడు. ఈ పరిణామాలను కొందరు తప్పుబడుతున్నారు.
పవన్ ఇంత హడావుడి చేసింది ఎందుకు అని, ఒక వైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తుంటే ఆ దీక్షపై నుండి దృష్టి మరల్చడానికి పవన్ ఇలా చేశాడని కొందరు అంటున్నారు. మరి కొందరు మాత్రం నేడు విడుదలైన భరత్ అనే నేను చిత్రం కలెక్షన్స్‌ను తగ్గించడం కోసమే పవన్ ఇలా చేశాడు అంటూ కొందరు అంటున్నారు. మొత్తానికి పవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో పాటు కనీసం తాను ఎందుకు ఛాంబర్‌కు వచ్చాను అనే విషయాన్ని తెలియజేయక పోవడంతో పలువురు పలు రకాలుగా ఊహించుకుని ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ ఇలా అర్థం పర్థం లేని నిరసన కార్యక్రమాలు తెలపడం వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి మీడియాకు ఇలా అందరికి ఇబ్బంది అని సామాన్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు పవన్ ఛాంబర్‌కు ఎందుకు వచ్చాడో రేపు అయినా తెలిసేనా? లేదా మెగా వర్గాల వారు అయినా తెలియజేసేనా అంటూ కొందరు యాంటీ మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మాకు 24 గంటల సమయం ఇచ్చి పవన్ అక్కడ నుండి వెళ్లి పోయాడు అంటున్నారు.