తెలంగాణలో అధికార వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ ఎలా విజయం సాధించింది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అందులో ఒకటి తెలంగాణవాదం. టీడీపీని నమ్ముకున్న పార్టీ నేతల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 13 సీట్లు తీసుకుని వాటిలో పార్టీ నేతలను గెలిపించుకునేందుకు బాబు ప్రచారం చేయడమే కూటమి కొంప ముంచింది. తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి కులమతాలకు అతీతంగా అందర్నీ తెలంగాణ గొడుకు కిందకు తెచ్చుకున్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ ప్రచారం చేసింది చంద్రబాబే టార్గెట్ గా అంటే ఆయన బలపరుస్తున్న కూటమి గెలిస్తే ఇక అంతా ఆంధ్ర పెత్తనం అనే విషయాన్నీ ప్రచారం చేసి జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. అంటే ఒక విధంగా చూస్తే ఆంధ్రను బూచిగా చూపి తెలంగాణ ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చారు. మరి ఈ సమయంలో ఏకమయి కూటమికి అండగా ఉండాల్సిన ఆంధ్రులు కులాల వారీగా విడిపోయి టీఆర్ఎస్ గెలుపుకు ప్రాణాలోడ్డారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లోనూ ఆసక్తిని రేకెత్తించాయి. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ ! ఎందుకంటే ఏ పార్టీ గురించి అయితే తమ పార్టీ పుట్టింది అని చెప్పుకునే వారో అటువంటి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం మాత్రమే కాదు, అక్కడ బాబు బలపరిచిన ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఏపీలో చంద్రబాబుకు ప్లస్ అవుతుందని, అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందిగా మారుతుదని అక్కడి ప్రతిపక్ష నేతలు భావించడమే. ఈ కారణంగానే టీఆర్ఎస్ ను గెలిపించాలన్న పట్టుదలను వైసీపీ, దానితో పాటు మొన్నటి వరకు కలిసి ఉంది బీజేపీ డైరెక్షన్ లో కొత్త కుంపటి పెట్టుకున్న జనసేన చూపించాయి. అధికారికంగా మద్దతు ప్రకటన చేయకపోయినా ఆ పార్టీకి చెందిన వారు తెలంగాణలో తమ సానుభూతి పరులందరికీ సందేశాలు పంపారు.
కూకట్ పల్లి లాంటి సెటిలర్ ప్రభావిత వోట్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ఓ సారి వైసీపీ సానుభూతి పరులు, మరోసారి జనసేన సానుభూతిపరులు కేటీఆర్ తో సమావేశాలు ఏర్పాటు చేశారు కూడా. ఒకవేళ కూటమి పరజాయం పాలయితే ఈ ఓటమిని టీడీపీకి అన్వయించేసి ఏపీలో రాజకీయ లాభం పొందడానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. సెటిలర్ల వోట్లు చీలడం వెనుక జనసేన, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించాయనేది బహిరంగ రహస్యం. ఎన్నికలలో పోటీ చేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు పరోక్షంగా మద్దతిచ్చింది. ఈ నేపధ్యంలోనే తెలంగాణాలో టీఆర్ఎస్ గెలుపు వైసిపి, జనసేనలకి తీవ్ర ఆనందాన్ని కలిగించింది. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో తెలంగాణలో మహాకూటమి పరాజయం, టీఆర్ఎస్ విజయాన్ని బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక మరో కారణం చూస్తే సంక్షేమ పధకాలు కేసీఆర్ క్షేమ మంత్రంతో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ముందస్తుఎన్నికలకు ఇదే ధీమాతో కేసీఆర్ వెళ్ళారు, అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్కు గెలుపు కష్టమంటూ ప్రచారాలు జరిగాయి. దీనితో తనదైన శైలిలో దూకుడుగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలను మానేసిన కేసీఆర్ ప్రతి ఎన్నికల సభలోనూ తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి పదేపదే చెప్పుకుంటూ వచ్చారు. అంతే కాదు తిన్న రేవును మర్చిపోకూడదంటూ సభలలో సెంటిమెంట్ పండించారు.
రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, కంటివెలుగు, రుణమాఫీపై స్పష్టమైన హామీలిచ్చారు. మళ్ళీ వస్తే మరింత మెరుగ్గా ఈ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. అంతేకాదు కొన్నింటిని రెట్టింపు చేస్తామని కూడా ప్రకటించారు.మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తామేం చేసింది, చేస్తున్నదీ చెప్పుకొచ్చారు.. ముఖ్యంగా 24 గంటల ఉచిత కరెంటు, పెన్షన్లు, రైతు బంధు పథకాలపై కేసీఆర్ చేసిన ప్రకటనలు గ్రామీణ ప్రాంత ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇక టీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పథకాల్లో కీలకమైనవి రైతు బంధు, రైతు బీమా, ఇరవైనాలుగు గంటల కరెంట్ గా చెప్పుకోవచ్చు. ఎన్నికలకు దాదాపు కొన్ని నెలల ముందు మేలో ప్రారంభించిన రైతు బంధు పథకం తెరాస తురుపుముక్క అని చెప్పవచ్చు. నేరుగా 58 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని సిద్ధం చేశారు. దీని కింద వచ్చే సొమ్ము కూడా చెక్కు రూపంలో అందజేయడం రైతులను ఆకర్షించింది. ఎన్నికల ముందే రెండో విడత చెక్కుల పంపిణీ కూడా టీఆర్ఎస్కు కలిసి వచ్చిందనే క్షేత్ర స్థాయిలో వస్తున్న సమాచారం. ఈ పథకం కింద ప్రస్తుతం ఎకరానికి 8వేలు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతానన్న కేసీఆర్ హామీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీంతో అన్నదాతలు కారు గుర్తుకి ఓటేసి మన అనుకున్నారు. ఇవన్నీ ఓట్ల వర్షం కురిపించి కేసిఆర్ ని మళ్ళీ రారాజుని చేసి కుర్చీ ఎక్కిస్తున్నాయి.