Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్నిరోజుల క్రితం వరకూ ట్విట్టర్ వేదికగా జనసేన నడుపుతున్నారని విమర్శలకు గురయిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత ఫుల్ టైం పొలిటీషియన్ గా మారారు. తెలంగాణలో, రాయలసీమలో పర్యటించి జనసేనను బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు.. అదేసమయంలో కేంద్రం ప్రవేశ పెట్టిన చివరి పూర్తిస్థాయి బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ టీడీపీ చేపట్టిన ఆందోళన పవన్ కు అనుకోని అవకాశాన్ని తెచ్చిపెట్టింది. మొన్నటిదాకా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వానికి మిత్రుడిగా ఉన్న పవన్ టీడీపీ, బీజేపీ సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో కొత్త అవతారం ఎత్తారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీల ఆందోళన తర్వాత జేఏసీ గురించి ప్రతిపాదించిన పవన్ తన వైఖరికి భిన్నంగా చకచకా పనులు చక్కబెడుతున్నారు.
జేఏసీ ప్రతిపాదన చేసిన రెండురోజులకే లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ ను కలిసి…భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన పవన్, మరో రెండు రోజుల తర్వాత కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు. అయితే జేపీతో భేటీకి,ఉండవల్లితో భేటీకి మధ్య పవన్ రాజకీయ వైఖరిలో స్పష్టమైన మార్పువచ్చింది. ముందునుంచీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న టీడీపీ మాటలకు మద్దతుగా ఉన్న పవన్…జేపీతో సమావేశం తర్వాత కూడా అదే రకమైన అభిప్రాయం వ్యక్తంచేశారు. విభజన హామీల అమలుపై పోరాటానికి మార్గదర్శకత్వం వహించేందుకు ఆర్థికవేత్తలు, రాజకీయవేత్తలు, మేధావులతో కమిటీ ఏర్పాటుచేస్తామన్న పవన్ ఉండవల్లితో సమావేశమైన తర్వాత మాట్లాడిన మీడియా సమావేశంలో మాత్రం విచిత్రవైఖరి కనబర్చారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదన్న సంగతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. రాష్ట్రం అడుగుతున్న సాయంపై మోడీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతూ కాలయాపన చేస్తున్న సంగతీ కళ్లముందు కనపడుతోంది. అయినప్పటికీ పవన్ తనకు నిజాలు తెలియాలనడం అందరికీ విస్మయం కలిగిస్తోంది.
అన్ని రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువే ఇచ్చామని, కేంద్రంలోని బీజేపీ చెబుతోందని, రాష్ట్రానికి రావాల్సినవేవీ సక్రమంగా రావడం లేదని, అంతా అస్తవ్యస్తంగా ఉందని రాష్ట్రం అంటోందని, ఈ పరిస్థితుల్లో తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేసేందుకు ఉండవల్లి, జేపీ ఆధ్వర్యంలో నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నానని పవన్ చెప్పుకొచ్చారు. ఈ నిజనిర్ధారణ కమిటీ ఎలాంటి విషయాలు వెల్లడిస్తుందో కానీ…సొంత రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తంచేస్తున్న ఆందోళనపై అనుమానాలున్నాయనడం ద్వారా పవన్ కేంద్రానికి పరోక్ష సాయమూ, రాష్ట్రానికీ నష్టమూ కలిగించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఏ ప్రభుత్వమూ…తాము సాయం చేయడం లేదని చెప్పదు. ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు గతంలో చేసిన చిన్న సాయాన్నే తిమ్మిని బమ్మిని చేసి పెద్దమొత్తంగా చూపించేదుకు ప్రయత్నిస్తుంది. కేంద్రప్రభుత్వమూ ప్రస్తుతం చేస్తోంది అదే.
సహజంగానే రాష్ట్ర బీజేపీ నేతలూ దాన్నే సమర్థించక తప్పని పరిస్థితి. కానీ పవన్ విషయం అలాకాదు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, ఏపీపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న ఉదాసీనతకు ఎలాంటి సాక్ష్యాలు అవసరమూ లేదు. చిన్న పిల్లలకు సైతం ఈ అన్యాయం అర్ధమవుతోంది. అలాంటిది పవన్ ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేస్తాననడం హాస్యాస్పదం తప్ప మరొకటి కాదు. టీడీపీ మాటలు సొంత రాష్ట్రంలోని నేతలే నమ్మడంలేదని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకునే అవకాశం కల్పించారు పవన్. ఆయన ఏ ఉద్దేశంతో ఇలా చేసినా నష్టపోయేది మాత్రం సాధారణ ప్రజలే అన్న సంగతి గుర్తుంచుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.