సూపర్ సైక్లోన్ ‘నింపన్’ సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా కోలుకోకముందే మరో తుపాను దూసుకోస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుపాను మహారాష్ట్ర, గుజరాత్ తీరాలపై విరుచుకుపడనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ముంబైకి సమీపంలో ఈ తుపాను బుధవారం తీరం దాటే అవకాశముందని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో భయంకరమైన గాలులు వీస్తాయని, ముంబై వాసులు అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ జారీ చేసింది. శతాబ్దకాలంలో ముంబై మహానగరాన్ని తాకనున్న రెండో అతిపెద్ద తుపానుగా ‘నిసర్గ’ను పేర్కొంటున్నారు.
‘అరేబియా సముద్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం దక్షిణ నైరుతి దిశగా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 12 గంటల్లో మరింత బలపడి తూర్పు మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో బలపడి తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. ప్రారంభంలో మంగళవారం ఉదయం వరకు ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తర ఈశాన్య దిశగా బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో హరిహరేశ్వర్ (రైగర్, మహారాష్ట్ర), దామన్ మధ్య ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలను దాటే అవకాశం ఉంద’ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు.
రాగల 24 గంటల్లో ముంబైపై తుపాను తీవ్ర ప్రభావం చూపనుందన్న సమాచారం నేపథ్యంలో కేంద్ర హెంశాఖ మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు 39 బృందాలను పంపినట్టు జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) ప్రకటించింది.