కాలిఫోర్నియాలో ఓ వింత చోటుచేసుకుంది. అదేమంటే.. ఓ మహిళ ఏకంగా బాతు పిల్లకు జన్మనిచ్చింది. అదెలా సాధ్యం అంటే.. అదేమరి ట్విస్ట్. జంతువులను పిల్లలుగా ఉన్నప్పుడు తెచ్చుకొని వాటిని పెంచుకోవడం వేరు. గుడ్డును తీసుకొచ్చి వాటిని ఇంక్యుబేటర్లో ఉంచి గుడ్లు పొదిగేలా చేసుకోవడం వేరు. అయితే.. క్యాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ మాత్రం ఓ బాతు గుడ్డును తీసుకొచ్చి శరీరంలో వేడి తగిలే ప్రదేశంలో 35 రోజులపాటు ఉంచింది. 35 రోజుల తర్వాత ఆ గుడ్డు నుంచి బాతుపిల్ల బయటకు వచ్చింది. దాంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
అసలేమిటి ఆ వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాలోని విశాలియా బెట్సే రాస్ అనే మహిళ తన పిల్లలతో కలిసి పార్కుకు వెళ్లింది. అక్కడ ఓ చోట బాతు గూళ్లు చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించింది. గుర్తుతెలియని వ్యక్తులు గుడ్లను కూడా చిదిమేశారు. అయితే.. వాటిలో ఒక గుడ్డుకు మాత్రం ఏమీ కాలేదు. చిన్న పగులు మాత్రమే ఉంది. ఆ గుడ్డును బాతు పొదిగినట్లయితే పిల్ల బయటకు వస్తుందని బెట్సే తమ పిల్లలకు చెప్పింది. దీంతో ఆమె పిల్లలు ఆ గుడ్డును తమతో తీసుకెళ్దామని ఒత్తిడి చేశారు. బాతు పిల్ల పుడితే పెంచుకుందామని అన్నారు. దీంతో ఆమె ఆ గుడ్డును ఇంటికి తీసుకెళ్లింది.
అయితే.. గుడ్డు నుంచి పిల్ల రావాలంటే ఏం చేయాలో ఆమెకు తెలీదు. ఇంట్లో ఇన్‌క్యుబేటర్ కూడా లేదు. దీంతో ఆమె స్థానిక వైల్డ్ లైఫ్ రెస్క్యూ ఆర్గనైజేషన్‌కు ఫోన్ చేసింది. వాళ్లు గుడ్లను తీసుకోమని తెలిపారు. దీంతో బెట్సే స్వయంగా ఆ గుడ్డును పొదగాలని నిర్ణయించుకుంది. యూట్యూబ్‌లోని వీడియోలను చూసి గుడ్లను ఎలా పొదగాలో తెలుసుకుంది. గుడ్లు పిల్లలుగా మారాలంటే వాటికి తేమతో కూడిన వెచ్చని ప్రదేశం కావాలని తెలుసుకున్న ఆమె అలాంటి ప్రాంతం కోసం వెతికింది. కానీ.. ఫలితం లేకుండా పోయింది. తన శరీరంలోని వేడితో గుడ్డును పొదగవచ్చని ఆలోచించింది. తన బ్రాలో రొమ్ముల మధ్య గుడ్డును ఉంచుకుంది. అలా 35 రోజులుపాటు ఆ గుడ్డును జాగ్రత్తగా బ్రాలోనే పెట్టుకుని తిరిగింది. ఎట్టకేలకు ఆ గుడ్డు నుంచి బాతుపిల్ల బయటకు వచ్చింది. దీంతో బెట్సే.. ఆమె పిల్లల సంతోషానికి అవధులే లేవు. బేట్సే ఇప్పుడు ఆ బాతును కూడా తన సొంతం బిడ్డగా సాకుతోంది. పిల్లలు కూడా దాన్ని తమ తోబుట్టువుగానే భావిస్తున్నారు. ఇప్పుడు ఆ బాతు పెద్దది కావడం విశేషం.