జిల్లాలోని జైనథ్ మండలం మాండగాడ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున కరడుగట్టిన దొంగలు బీభత్సం సృష్టించారు. ఏడుగురు దొంగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాల్లో దొంగల దృశ్యాలు రికార్డు అయ్యాయి. దొంగల చేతుల్లో గొడ్డళ్లు, రాళ్లు, తాళ్లు ఉన్నాయి.
ముందుగా భౌనే అనిల్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి రూ.29వేల నగదు, 9 గ్రాముల బంగారం, 50 తులాల వెండి అపహరించారు. అనిల్ ఇంటి చుట్టు పక్క ఉన్న ఇళ్లకు బయట నుంచి గడిలు పెట్టి అడ్డంగా తాళ్లు కట్టారు. దొంగల శబ్దం విని పక్క ఇంట్లో నుంచి బయటకు వచ్చిన విట్టల్‌రెడ్డి అనే వ్యక్తిపై దొంగలు రాళ్లతో దాడి చేశారు. దీంతో విట్టల్‌రెడ్డి గ్రామస్తులకు ఫోన్ చేసి సమాచారం అందిచారు.
తాళం వేసి ఉన్న పెడపర్తి ఆశన్న అనే మరో వ్యక్తి ఇంట్లో కూడా దొంగలు చొరబడి రూ.1500 నగదు, 7గ్రాముల బంగారం, 16తులాల వెండి చోరీ చేశారు. గ్రామంలో చోటు చేసుకున్న చోరీలు మహారాష్ట్ర దొంగలు చేశారా? స్థానిక దొంగలు చేశారా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని సీఐ మల్లేష్ తెలిపారు. క్లూస్‌టీమ్ సీసీ దృశ్యాలను పరిశీలిస్తోందని పేర్కొన్నారు. వర్షం కారణంగా ఆధారాల సేకరణలో కొంత ఇబ్బంది కలుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ చోరీలతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.