ఏటీఎం నుంచి రూ. 42.39 లక్షలు చోరీ

ఏటీఎం నుంచి రూ. 42.39 లక్షలు చోరీ

హాలీవుడ్‌ తరహాలో ఏటీఎంలో ఇద్దరు ముసుగు దొంగలు రూ. 42.39 లక్షలు దోచుకుని పరారైన ఘటన గుర్‌గ్రాంలో వెలుగుచూసింది. మే 23న సుశాంత్‌లోక్‌ ప్రాంతంలోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ దోపిడీకి సంబంధించి నిందితులను పోలీసులు ఇంతవరకూ గుర్తించలేదు. ఈ ఏటీఎంలో మే 20న రూ. 28 లక్షల నగదు నింపారని, మూడు రోజుల తర్వాత సాంకేతిక సమస్యలతో మెషిన్‌ పనిచేయడం లేదని ఫిర్యాదు రావడంతో నగదు నిర్వహణ సంస్థ సిబ్బంది తనిఖీ చేయడంతో దోపిడీ గుట్టు రట్టయింది.

ఏటీఎం నుంచి రూ. 42.39 లక్షలు చోరీ అయ్యాయని గుర్తించామని కంపెనీ ప్రతినిధి గిరీష్‌ పాల్‌ సింగ్‌ చెప్పారు. ఏటీఎంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా మే 23 రాత్రి 2.30 గంటల సమయంలో ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఏటీఎం కియోస్క్‌కు చేరుకుని కెమెరా లెన్స్‌ను తొలగించినట్టు కనిపించిందని అన్నారు. ఏటీఎంను గ్యాస్‌ కట్టర్‌ ఉపయోగించి నిందితులు తెరవలేదని, హ్యాకింగ్‌ పరికరం ద్వారా నగదును దొంగిలించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇంటిదొంగల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.