నుమాయిష్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర…?

There Are Many Suspicions About Fire In Numaish Exhibition

చారిత్రక నేపథ్యమున్న హైదరాబాద్‌లోని నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. వేలాది మంది సందర్శకులు ఉన్న సమయంలో మహేశ్ కోపరేటివ్ బ్యాంక్ స్టాల్‌ లో సంభవించిన షార్ట్ సర్క్యూట్‌ వల్ల చెలరేగిన మంటలు క్షణాల్లో సమీపంలోని స్టాళ్లకు వ్యాపించాయి. దీంతో ఫైరింజన్లు సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెవాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 200 స్టాళ్లు అగ్నికి ఆహుతయ్యాయని, ఈ క్రమంలో రూ.40కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రాణనష్టాన్ని నివారించడంలో మాత్రం అధికారులు సఫలయ్యారు. అయితే నుమాయిష్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వెనుక కుట్ర ఏదైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎగ్జిబిషన్ ద్వారా సొసైటీకి ఏటా సుమారు రూ.40కోట్ల వరకు ఆదాయం వస్తుంది. దీంతో సొసైటీలో మెంబర్‌షిప్ కోసం ప్రముఖులతో సహా ఎంతోమంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటీవలే సొసైటీలో కొత్త కమిటీ కొలువుదీరింది. దీంతో పాత, కొత్త సొసైటీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నుమాయిష్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగినప్పటికీ సహాయ సిబ్బంది సకాలంతో స్పందించడంతో ప్రాణనష్టం తప్పింది. రాత్రి 8.40 గంటలకు ప్రారంభమైన స్వల్ప అగ్నిప్రమాదం తీవ్రరూపం దాల్చడానికి 20 నిమిషాలు పట్టింది. అగ్నిప్రమాదం సంభవించగానే అప్రమత్తమైన ఎగ్జిబిషన్‌ సిబ్బంది, పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది సందర్శకులను మూడు గేట్ల ద్వారా బయటకు పంపించివేశారు. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి సందర్శకులను వీలైనంత త్వరగా ఖాళీ చేయించేందుకు కృషి చేశారు. ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రత్యేక రైళ్లను నడిపారు. ఎగ్జిబిషన్ రద్దీగా ఉన్న సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో ఆందోళనకు గురైన సందర్శకులు ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. దీంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇలాంటి పరిస్థితిలో మెట్రో అధికారులు వెంటనే స్పందించారు. టికెట్ లేకుండా ఉచిత ప్రయాణానికి అనుమతించారు. అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా ఎక్కువ మంది ప్రజలను ఘటనాస్థలి నుంచి దూరంగా తరలించేందుకు కృషి చేశారు. నాంపల్లి నుంచి ఎల్బీ నగర్ వరకు ఐదు ప్రత్యేక సర్వీసులను హైదరాబాద్ మెట్రో రైల్ నడిపింది.