నాలుగున్నరేళ్ళ తర్వాత ఎమ్మెల్యే అయిన వైసీపీ నేత…!

Thippeswamy Swearing As Madakasira MLA

అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా వైసీపీ నాయకులు తిప్పేస్వామి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని స్పీకర్‌ కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ తిప్పేస్వామి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పార్థసారథి, మల్లాది విష్ణు పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఉన్న క్రిమినల్‌ కేసులతోపాటు కుటుంబసభ్యుల ప్రభుత్వ ఉద్యోగాల గురించి ప్రస్తావించలేదని వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన హైకోర్టు తిప్పేస్వామి వాదనను సమర్థిస్తూ.. ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఈరన్న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను వైసీపీ నేతలు ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. దీంతో తిప్పేస్వామి నేడు మడకశిర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరన్న ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించారని, తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనలేదని తిప్పేస్వామి అన్నారు. ఈరన్నను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని నాలుగున్నర సంవత్సరాలు న్యాయ పోరాటం చేశానని, చివరికి న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. కోర్టు అతన్ని అనర్హుడిగా ప్రకటించిందన్నారు. కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా జిల్లాకు తీసుకువచ్చేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తక్కువ సమయం ఉందని అయినా నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే తిప్పేస్వామి తెలిపారు.