రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్ మొదలైందని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుత దశను రెండో ప్రమాద హెచ్చరికగా ఆయన అభివర్ణించారు. దేశంలో, తెలంగాణలోనూ మరోసారి కరోనా సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని చెప్పారు. వచ్చే 2 నుంచి 4 వారాలు కీలకమైనవన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వ్యాప్తి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికీ హానికలిగే అవకాశాలున్నాయన్నారు.
అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు రోజుకు 10 వేల కేసులొచ్చాయని, ఇప్పుడు కొద్దికాలంలోనే అత్యధిక స్థాయికి వెళ్లి రోజుకు 30 వేల కేసుల దాకా రికార్డయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే అంతే త్వరగా వైరస్ తీవ్రత తగ్గిపోయి కేసులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని, ఒమిక్రాన్‌తో వచ్చే 6 నెలల్లో కోవిడ్ నుంచి విముక్తి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.