తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తిరుపతిలోని టీటీడీ నిర్మించిన కాటేజీల్లో బస చేస్తూ ఉంటారు. తిరుమలకి వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాలను టీటీడీ నిర్మించింది. అయితే ఇప్పటి వరకూ ఈ గదుల బుకింగ్‌లో ఉన్న నిబంధనల్లో టీటీడీ స్వల్పమార్పులు చేసింది. ఇవి జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా మార్పుల ప్రకారం విష్ణునివాసం వసతి సముదాయంలో అన్ని గదులను కరంట్ బుకింగ్‌లో మాత్రమే భక్తులు కేటాయిస్తారు. ఇక్కడ గదులు పొందిన సమయం నుంచి 24 గంటలలోపు ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇక, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో అన్ని గదులను ఆన్‌లైన్‌లో భక్తులు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక్కడ ఉదయం 8 నుంచి మర్నాడు ఉదయం 8 గంటల వరకు 24 గంటల స్లాట్ విధానం అమల్లో ఉంటుంది. భక్తులు బుక్ చేసుకున్న సమయం కంటే ఆలస్యంగా చేరుకున్నా ఉదయం ఎనిమిది గంటలకే ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇక మరోపక్క తిరుమలలో భక్తుల రద్దీ అసాధారణ స్థాయిలో ఉంది. ధర్మ దర్శనానికి వైకుంఠం-2 ఎదుట రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 26 గంటలకుపైగా సమయం పడుతోంది. దీంతో మహాలఘు దర్శనాన్ని టీటీడీ అమలు చేస్తోంది. అలాగే, రూ.300 టోకెన్లు ముందస్తుగా తీసుకున్న భక్తులను ఉదయం 10 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తున్నారు.