ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా మూడుసార్లు మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) నిలిచింది. అద్భుత ఫామ్‌లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించినా… మరో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ జట్టు గెలుపొందడంతో… చెన్నై జట్టుకు ప్లే ఆఫ్ దశ అవకాశాలు మూసుకుపోయాయి. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో చెన్నై జట్టు లీగ్ దశలోనే వెనుదిరగడం ఇదే తొలిసారి.
వరుస పరాజయాలతో డీలా పడ్డ చెన్నై జట్టు స్యామ్ కరన్ (3/19), యువ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ (51 బంతుల్లో 65 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ప్రదర్శనతో లీగ్‌లో నాలుగో విజయాన్ని సాధించింది. మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (43 బంతుల్లో 50; 1 ఫోర్, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. డివిలియర్స్ (39; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 68 బంతుల్లో 82 పరుగులు జోడించారు. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ తొలి అర్ధసెంచరీతో చెలరేగడంతో చెన్నై 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 150 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అంబటి రాయుడు ( 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డు ప్లెసిస్ (25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (19 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు.