ఇది గెల్చి తీరాల్సిన యుద్ధం 21శతాబ్దం భారత్ దే : మోడీ

అంతా భావించినట్లుగా సరిగ్గా 8గంటలకు ప్రధాని మోడీ భారత ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. కనిపించని వైరస్ తో యుద్ధం చేస్తున్నామని.. చివరకు విజయం మనదే అంటూ మోడీ జాతికి ధైర్యమిచ్చారు. ప్రపంచ దేశాలన్నీ అంకితభావంతో ఉన్న మనల్నే ఆదర్శంగా తీసుకుంటున్నాయని, ఇది మనం గెలిచి తీరాల్సిన యుద్ధమంటూ మోడీ స్పష్టం చేశారు.  అలాగే.. కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మోడీ. ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం కొనసాగిద్దామంటూ పిలుపునిచ్చారు. ఎన్నో మహమ్మారులను మనం ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నామని కరోనాను కూడా ధీటుగా ఎదుర్కొంటామని.. ఇది గెలవాల్సిన గెల్చితీరాల్సిన యుద్ధమని మోడీ వివరించారు.
అదేవిధంగా ఈ విపత్కర సమయంలో భారత్ శక్తిసామర్థ్యాలను ప్రపంచమంతా ఆదర్శనంగా తీసుకుంటుందని మనదారిలో నడిచేందుకు ఉవ్వుళ్లూరుతోందని మోడీ వెల్లడించారు. భారత ఔషధాలు ప్రపంచానికి వరంగా మారుతున్నాయని.. ప్రపంచానికి భారత్ యోగాను కానుకగా ఇచ్చిందని.. నాడు 2000 సంవత్సరంలో వై2కే సమస్య ఉత్పన్నమైతే యావత్ కంప్యూటర్ ప్రపంచం తల్లడిల్లిపోయిన వేళ భారత నిపుణులు నిబ్బరంగా గుండె ధైర్యంతో సమస్యను ఎదుర్కొన్నారని.. ప్రపంచానికి దిశా నిర్దేశం చేశారని ప్రధాని మోడీ తెలిపారు.
అంతేకాకుండా ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడంలో చాలా కీలకమైన దశలో మనం ఉన్నామని, స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా నివారణ మార్గమని స్పష్టం చేశారు. ఇలాంటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదని.. అయితే ఈ మహమ్మారిపై పోరాటంలో ఓడిపోవడానికి మనం సిద్ధంగా లేమని అన్నారు. కరోనా వైరస్ ఓ సందేశాన్ని తీసుకువచ్చిందని, బతకాలి, బతికించుకుంటూ ముందుకు సాగాలి అన్నదే ఆ సందేశమని మోడీ వివరించారు.
అదేవిధంగా  గత నాలుగు నెలలుగా దేశం కరోనాపై పోరాటం చేస్తుందని..  ప్రజలంతా ఎంతగానో సహకరిస్తున్నారని.. ఇలాంటి ఏకీభావమే మన ఆయుధమని మోడీ అన్నారు. ప్రజలందరూ ఆత్మస్తైర్యంతో ఉన్నారని, ప్రతి ఒక్కరు ఈ పోరాటంలో సహకరిస్తున్నారని మోడీ జాతిని ఉద్దేశించి వివరించారు.
అంతేకాకుండా కరోనా ప్రారంభమైన మొదట్లో ఇండియాలో పీపీఈ కిట్లు లేవని, కనీసం ఎన్95 మాస్కులు కూడా లేవని చెప్పిన మోడీ.. ఇప్పుడు ఇండియాలో రోజుకు 2లక్షల పీపీఈ కిట్లు, 2 లక్షల ఎన్ 95 మాస్కులు తయారు చేస్తున్నట్టు వివరించారు. ఇండియా నుంచి సప్లై చేస్తున్న మెడిసిన్స్ ప్రపంచానికి ఆశాజ్యోతినిగా నిలిచాయని మోడీ అన్నారు. 21 వ శతాబ్దం భారత్ దే అని చెప్పిన మోడీ, ప్రజలను ఆదుకోవడానికి భారీ ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట 2020లో 20 లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించడం విశేషం. వివిధ వర్గాల వారిని ఆదుకోవడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. అలాగే మోడీ ఆత్మ నిర్భర్ భారత్ పేరిట రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని మోడీ ప్రకటించారు. వీటిని ముఖ్యంగా వ్యవసాయం, లఘుపరిశ్రమలు, కీటీర, కార్మికులపై వెచ్చించనుంది కేంద్రం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్థికశాఖ మంత్రి ప్రకటిస్తారని మోడీ తెలిపారు.
చివరగా కరోనాపై సుదీర్ఘకాలంపాటు యుద్ధం తప్పదని మోడీ అన్నారు. అదే సమయంలో ఓవైపు మహమ్మారితో యుద్ధం, మరోవైపు అభివృద్ధి కోసం పోరాటం చేయాల్సిందేని మోడీ జాతికి పిలుపునిచ్చారు. ఈ బాధ్యతను 130 కోట్ల మంది తలకెత్తుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మే 17తో మూడో దశ లాక్ డౌన్ ముగియనుండగా.. మే 18 నుంచి లాక్ డౌన్ కు కొత్త రూపు రానుందని వెల్లడించారు. లాక్ డౌన్-4లో కూడా అన్ని నియమాలు, జాగ్రత్తలు పాటిద్దామని మోడీ వివరించారు.