రతన్ టాటాకు బెదిరింపు కాల్.. ముంబై పోలీసుల అప్రమత్తం..

Threatening call to Ratan Tata.. Mumbai police alerted..
Threatening call to Ratan Tata.. Mumbai police alerted..

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇటీవల ముంబయి పోలీసు కంట్రోల్ రూమ్కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. రతన్ టాటా ప్రాణానికి ముప్పు ఉందని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. టాటా భద్రతను పెంచాలని.. లేదంటే ఆయనకు కూడా సైరస్ మిస్త్రీలాగే అవుతుందని పేర్కొన్నట్లు తెలిపాయి. ఈ వారం ఆరంభంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దీంతో అప్రమత్తమైన పోలీసులు రతన్ టాటా భద్రతను పెంచడంతో పాటు కొన్ని తనిఖీలు కూడా చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి గురించి దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక నుంచి ఆ ఫోన్ వచ్చినట్లు గుర్తించి.. వెంటనే అక్కడికి వెళ్లి అతడిని అరెస్టు చేశారు. నిందితుడిని పుణెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే ఇం టి నుం చి వెళ్లిపోయిన అతడు.. కర్ణాటక నుంచి ముంబయి పోలీసులకు ఫోన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపాయి.

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ అయిన సైరస్ మిస్త్రీ గతేడాది సెప్టెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మిస్త్రీతో పాటు కారులో ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు.