నిర్లక్ష్యంగా వదిలేసిన సెల్లార్ గుంత అభం శుభం తెలియని ముగ్గురు బాలికలను బలితీసుకుంది. శుక్రవారం పాఠశాలకు సెలవు కావటంతో ఇంటివద్దనే ఉన్న బాలికలు ఆడుకునేందుకు సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. గుంతలో ఉన్న నీటిలోకి దిగే క్రమంలో ఒకరు జారిపడిపోతోంటే.. ఆమెను కాపాడేందుకు ఒకరి తరువాత ఒకరు మొత్తం ఐదుగురు బాలికలు అందులో పడిపోయారు. ముగ్గురు చనిపోగా ఇద్దరు బయటపడ్డారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 4వ ఫేజ్‌లో ఆర్‌టీఐ కార్యాలయం ఆనుకొని ఉన్న ఆరెకరాల ఖాళీ స్థలంలో 8 ఏళ్ల క్రితం బహుళ అంతస్థుల నిర్మాణం కోసం సెల్లార్ గుంతలు తవ్వారు. అప్పటి నుంచి ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవటంతో గుంతలోకి భారీ ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది.
బతుకుదెరువు కోసం బిహార్ నుంచి వచ్చిన లక్ష్మీ ప్రసాద్ టీ కొట్టు నిర్వహిస్తూ తన ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకుతో ఆర్‌టీఐ కార్యాలయం సమీపంలో ఉంటున్నాడు. అతని నాలుగో కుమార్తె సంగీత కుమారి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. యూపీకి చెందిన ప్రమోద్ గుప్త, గీత దంపతులు కూడా ఆర్‌టీఐ కార్యాలయం సమీపంలోనే టీ కొట్టు నిర్వహిస్తున్నారు. వీరి కూతురు రమ్య అదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.నాగర్‌కర్నూల్‌కు చెందిన పర్విన్ కుమార్తె సోఫియా నాలుగో తరగతి చదువుకుంటోంది.
వీరితోపాటు చదువుతున్న నేహా, సంగీత చెల్లెలు నబియా ఐదుగురు కలిసి మధ్యాహ్నం ఆడుకునేందుకు సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. తొలుత సంగీత నీటిలో దిగేందుకు యత్నించగా, ఆమెను కాపాడేందుకు రమ్య నీటిలోకి దిగి ఆమె సైతం మునిగింది. వీరిని కాపాడేందుకు సోఫియా యత్నించగా ఆమె కూడా మునిగిపోయింది. నేహా, నబియా వీరిని కాపాడేందుకు యత్నించి అదృష్టవశాత్తు బయటపడ్డారు. వీరు తర్వాత ఇంట్లో విషయం చెప్పడంతో కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సంగీత, సోఫియా, రమ్య మృతదేహాలను వెలికి తీశారు.